మహేష్ అప్పుడు ఫుల్ రెస్ట్... ఇప్పుడు నో రెస్ట్
మొత్తానికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులతో పాటు ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను పలు కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు వేశారు. వరుస వాయిదాల కారణంగా పలువురు టెక్నీషియన్స్ ఇంకా హీరోయిన్ కూడా మార్చాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా చాలా సంవత్సరాల తర్వాత రాబోతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా నిరాశ పరిచినా కూడా గుంటూరు కారం సినిమాకు భారీ క్రేజ్ ఉంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ సంక్రాంతికి విడుదల చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో షూటింగ్ ఆగడం, లేదంటే మహేష్ బాబు ఏదో ఒక హాలీడే ట్రిప్ వల్ల షూటింగ్ కి బ్రేక్ పడటం జరిగింది. ఇన్నాళ్లు ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో రోజుల్లో 12 నుండి 15 గంటల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. సంక్రాంతికి సినిమా విడుదల చేయడం కోసం డిసెంబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులతో పాటు ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేసేలా కనిపిస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది.
గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి ని ఎంపిక చేశారు. ఈ సినిమా లో మహేష్ బాబు పాత్ర ఏంటి, ఇతర విషయాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు.