థియేట‌ర్‌లో యాడ్స్‌తో స‌మ‌యం వృధా.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

ఫిర్యాదుదారుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వినియోగదారుల కోర్టు ఐనాక్స్ పీవీఆర్ సినిమాస్ ను ఆదేశించింది.

Update: 2025-02-19 04:00 GMT

ప్ర‌స్తుత బిజీ షెడ్యూళ్ల న‌డుమ సినిమాకి స‌మ‌యం కేటాయించ‌డం అంటే కొందరికి చాలా క‌ష్టం. కానీ అత‌డు త‌న‌కు ఉన్న కొద్ది పాటి స‌మ‌యాన్ని థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూసేందుకు వెచ్చించాడు. కానీ థియేట‌ర్ లో స‌రైన స‌మ‌యానికి సినిమా వేయ‌క‌పోవ‌డ‌మే గాక‌, కేటాయించిన స‌మ‌యానికి మించి అన‌వ‌స‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌ల‌తో త‌న స‌మ‌యాన్ని వృధా చేసారు. దీంతో అత‌డు వినియోగ‌దారుల కోర్టులో ప‌రిష్కారం కోర‌డం, ఈ కేసులో విజ‌యం సాధించ‌డం సంచ‌ల‌న‌మైంది.

బెంగళూరుకు చెందిన ఒక‌ వ్యక్తి 25 నిమిషాల ప్రకటనలతో తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు పీవీఆర్ -ఐనాక్స్ పై దావా వేసి ఈ కేసులో గెలుపొంద‌డం సంచ‌ల‌న‌మైంది. ``సమయాన్ని డబ్బుగా పరిగణిస్తారు`` అని పేర్కొంటూ, ఫిర్యాదుదారుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వినియోగదారుల కోర్టు ఐనాక్స్ పీవీఆర్‌ సినిమాస్ ని ఆదేశించింది. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి సినిమా ప్రదర్శనకు ముందు సుదీర్ఘ ప్రకటనలతో విలువైన‌ 25 నిమిషాల టైమ్ వృధా చేసి మానసిక వేదన కలిగించినందుకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, బుక్ మై షోలపై దావాలో నష్టపరిహారంగా రూ.28,000 గెలుచుకున్నాడ‌ని బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

అభిషేక్ ఎంఆర్ థియేట‌ర్‌లో సాయంత్రం 4.05 గంటలకు `సామ్ బహదూర్`(2023) సినిమా కోసం మూడు టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. సినిమా సాయంత్రం 6.30 గంటలకు ముగియాల్సి ఉంది. ఆ తర్వాత తన పనిలో వెళ్లాల‌ని అనుకున్నాడు.. కానీ అతడికి బిగ్ షాక్ నిస్తూ సినిమా ప్రకటనలు, ట్రైలర్లు ప్రసారం చేసిన‌ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు సినిమా ప్రారంభమైంది. దీనివ‌ల్ల త‌న విలువైన స‌మ‌యం దాదాపు 30 నిమిషాల వృధా చేసిందని అత‌డు కోర్టులో వాదించాడు. ఫిర్యాదుదారుడు ఆ రోజు షెడ్యూల్ చేసిన ఇతర అపాయింట్‌మెంట్‌లకు హాజరు కాలేకపోయాడు. పరిహారంగా డబ్బు పరంగా లెక్కించలేనంత‌ నష్టాన్ని ఎదుర్కొన్నాన‌ని వాదించారు. వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల‌తో త‌న స‌మ‌యం వృధా చేయ‌డం అన్యాయ‌మ‌ని అత‌డు కోర్టులో వాద‌న వినిపించాడు. సమయాన్ని డబ్బుగా పరిగణించాల‌నే అత‌డి వాద‌న‌ను న్యాయ‌మూర్తులు విన్నారు.

ఫిర్యాదుదారుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వినియోగదారుల కోర్టు ఐనాక్స్ పీవీఆర్ సినిమాస్ ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడి సమయాన్ని వృధా చేసినందుకు రూ. 20,000, మానసిక వేదన క‌లిగించినందుకు ఇతర ఉపశమనాలకు రూ. 8000 చెల్లించాలని PVR సినిమాస్, INOX లకు కోర్టు జరిమానా విధించింది. వినియోగ‌దారుల సంక్షేమ నిధికి మ‌రో 1,00,000 జ‌మ చేయాల‌ని కూడా ఆదేశించింది. అయితే బుక్ మై షో టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ కి ప్రకటనల స్ట్రీమింగ్ సమయంపై ఎటువంటి నియంత్రణ లేనందున ఎటువంటి క్లెయిమ్‌లను చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఇతరుల సమయం, డబ్బుతో ప్రయోజనం పొందే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు త‌న ఉత్త‌ర్వులో పేర్కొంది. గంట‌ల కొద్దీ స‌మ‌యం వినియోగ‌దారుడు కేటాయించి ప్ర‌క‌ట‌న‌లు చూడ‌లేర‌ని కోర్టు పేర్కొంది. బిజీ షెడ్యూల్‌తో ఉన్న వ్యక్తులు అనవసరమైన ప్రకటనలను చూడటం చాలా కష్టం అని తీర్పు వెలువ‌డింది.

అయితే తమ వాదనలో ఐనాక్స్ పీవీఆర్ సినిమాస్ చట్టప్రకారం ప్ర‌జ‌ల్లో అవగాహనను పెంపొందించ‌డానికి కొన్ని పబ్లిక్ సర్వీస్ ప్రకటనలను (పిఎస్‌ఏ) ప్రదర్శించాల్సి ఉంటుంద‌ని వాదించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే సినిమా ప్రారంభానికి 10 నిమిషాల ముందు, సినిమా ప్యాకేజీ రెండవ భాగం ప్రారంభానికి ముందు విరామ కాలంలో PSAలను ప్రదర్శించాలని కోర్టు పేర్కొంది. ఐనాక్స్ పీవీఆర్ సినిమాస్ వినియోగదారుల సంక్షేమ నిధికి లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఆర్డర్ తేదీ నుండి 30 రోజుల్లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News