మంచు విష్ణు 'తరంగ వెంచర్స్' ఏం చేయనుంది..!
ఈ సంస్థలో హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ భాగస్వామి అయ్యేందుకు ఒప్పుకున్నారని, త్వరలోనే అధికారికంగా ఆయనతో ఒప్పందాలు ఉంటాయి అంటూ మంచు విష్ణు ప్రకటించారు.
మంచు హీరో విష్ణు ఇప్పటికే మల్టీ ట్యాలెంట్ అనిపించుకుంటూ ఎన్నో రంగాల్లో ఉన్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే సినిమాలను నిర్మిస్తూ, రచయితగా వ్యవహరిస్తున్నారు. విద్యా సంస్థల నిర్వాహకుడిగా, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న మంచు విష్ణు కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. తరంగ వెంచర్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి ఈ సంస్థ సేవలు అందించబోతుంది. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థలో హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ భాగస్వామి అయ్యేందుకు ఒప్పుకున్నారని, త్వరలోనే అధికారికంగా ఆయనతో ఒప్పందాలు ఉంటాయి అంటూ మంచు విష్ణు ప్రకటించారు.
ఈ సమయంలో అసలు మంచు విష్ణు మొదలు పెట్టిన తరంగ వెంచర్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనేది కొందరు చర్చించుకుంటున్నారు. మంచు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా ఇండస్ట్రీకి అవసరం అయ్యే అత్యాధునిక టెక్నాలజీని అందిస్తుంది. ఓటీటీ వేదికలు, యానిమేషన్ మూవీస్, గేమింగ్ సంస్థల కోసం ఏఆర్, ఏఐ, వీఆర్ టెక్నాలజీలను అందించనుంది. ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రాబోయే పదేళ్ల కాలంలో రాబోతున్న విప్లవాత్మక మార్పులను ఉద్దేశించి తరంగ వెంచర్స్ వర్క్ చేయబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలోని కొత్త వారికి ఆర్థిక తోడ్పాటును అందించడంతో పాటు ప్రతిభను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. భవిష్యత్తులో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని ఆ దిశగా తీసుకు వెళ్లడంలో తరంగ వెంచర్స్ కీలక పాత్ర పోషించనుంది. పలు వీఎఫ్ఎక్స్ సంస్థలకు తరంగ వెంచర్స్ నుంచి టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో పాటు ఇంకా పలు విషయాల్లోనూ తోడ్పాటును అందించే విధంగా ఈ సంస్థ పని చేయబోతున్నట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
ఇక మంచు విష్ణు ప్రస్తుత సినిమా విషయానికి వస్తే కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సినిమాను సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. కన్నప్ప సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం పని చేస్తున్న సమయంలో మంచు విష్ణుకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తరంగ వెంచర్స్ లో మంచు విష్ణుతో పాటు ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వామ్యులుగా ఉండబోతున్నారు. భవిష్యత్తులో తరంగ వెంచర్స్ అతి పెద్ద కంపెనీగా నిలువబోతుందని అంటున్నారు.