‘మంగళవారం’ మూవీ రివ్యూ

Update: 2023-11-17 06:22 GMT

'మంగళవారం' మూవీ రివ్యూ

నటీనటులు: పాయల్ రాజ్‌ పుత్-నందిత శ్వేత-దివ్యా పిళ్లై, అజ్మల్ ఆమిర్-రవీంద్ర విజయ్-కృష్ణచైతన్య-అజయ్ ఘోష్-ప్రియదర్శి-శ్రవణ్ రెడ్డి-శ్రీతేజ్ తదితరులు

సంగీతం: అజనీష్ లోక్ నాథ్

ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి

మాటలు: తైజుద్దీన్ సయద్-కళ్యాణ్ రాఘవ్

నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి-సురేష్ వర్మ

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అజయ్ భూపతి

అరంగేట్ర చిత్రం 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి.. తన రెండో చిత్రం 'మహాసముద్రం'తో తీవ్ర నిరాశకు గురి చేశాడు. అతడి మూడో సినిమా 'మంగళవారం' ప్రోమోలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. అజయ్ కమ్ బ్యాక్ ఫిలింలా కనిపించిన 'మంగళవారం' ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా? చూద్దాం పదండి.

కథ:

గోదావరి ప్రాంతంలోని మహాలక్ష్మీపురం అనే గ్రామంలో 1996 ప్రాంతంలో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ ఊరి అమ్మవారికి ఇష్టమైన మంగళవారం రోజున వరుసగా రెండు వారాలు ఇద్దరు (ఒక మహిళ, ఒక పురుషుడు) చొప్పున చనిపోతారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంట గురించి ముందు గోడల మీద పేర్లు రాయడం.. ఆ వెంటనే ఆ ఇద్దరు చనిపోవడం.. ఇలా వరుసగా రెండు వారాలు జరగడంతో ఊరంతా బెంబేలెత్తిపోతుంది. ఊరివాళ్లు అవి ఆత్మహత్యలుగా భావించినప్పటికీ.. ఎస్ఐ మాయ (నందిత శ్వేత) మాత్రం హత్యలని బలంగా నమ్ముతుంది. కొంత కాలం కిందటే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన శైలజ (పాయల్ రాజ్ పుత్) దయ్యమై ఈ హత్యలు చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. మరి ఈ హత్యలతో నిజంగా శైలజకు సంబంధముందా.. ఈ మిస్టరీని మాయ ఎలా ఛేదించింది అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

'ఆర్ఎక్స్ 100'లో కొన్ని బోల్డ్ సీన్ల వరకు చూస్తే అది యువతలోని కామోద్రేకాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే సినిమాలా కనిపిస్తుంది. కానీ కథానాయిక పాత్రను ప్రెజెంట్ చేసిన విధానంలో అదొక ట్రెండ్ సెటర్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ పాత్రను అలా చూపించిన సినిమా తెలుగులో అప్పటిదాకా రాలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాల్లో ఎన్నో ట్విస్టులు చూశాం కానీ.. అందులో చూసిన ట్విస్ట్ ఏమాత్రం ఊహకు అందనిది. కథానాయిక పాత్రను అలా తీర్చిదిద్దాలనే ఆలోచనకే అజయ్ భూపతికి వీరతాడు వేసేయొచ్చు. తొలి సినిమాతో అంతగా ఆశ్చర్యపరిచిన అజయ్.. రెండో సినిమా 'మహాసముద్రం'ను అంత చప్పగా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో అజయ్ వన్ ఫిలిం వండరేనా అన్న చర్చ జరిగింది. కానీ 'మంగళవారం'తో అతను ఆ అభిప్రాయాన్ని మార్చాడు. మళ్లీ తన స్టయిల్లో కథానాయిక పాత్రను సంచలనాత్మకంగా ప్రెజెంట్ చేస్తూ.. ఆఖరి అరగంటలో ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూ ఒక వైవిధ్యమైన థ్రిల్లర్ మూవీని అందించాడు అజయ్. కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక వైవిధ్యమైన మిస్టరీ థ్రిలర్ చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్.

'మంగళవారం' సినిమా గురించి చెబుతూ.. ఇందులో తాను డిస్కస్ చేసిన పాయింట్ ఇండియాలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయలేదని చెప్పాడు అజయ్ భూపతి. ఇందులో పాయల్ పాత్రను చూసినపుడు అతడి మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది. 'ఆర్ఎక్స్ 100'లో తాను క్రియేట్ చేసిన పాత్ర నుంచే స్ఫూర్తి పొందాడో ఏమో తెలియదు కానీ.. దానికి ఒక కొత్త కోణాన్ని జోడించి తీర్చిదిద్దిన పాయల్ క్యారెక్టర్ కచ్చితంగా ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. 'ఆర్ఎక్స్ 100'లోని కథానాయిక లక్షణాలనే పాజిటివ్ కోణంలో చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. అందులో మాదిరే ఈ కథలోనూ యూఎస్పీ కథానాయిక పాత్రే. తెర మీద స్క్రీన్ టైం తక్కువే కానీ.. కథలో మాత్రం ఆ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సీన్లు అస్సలు జీర్ణించుకోలేం. ఈ ఎపిసోడ్ త్వరగా అయిపోతే బావుణ్ను అనిపిస్తుంది. ఈ పాత్రను ఇలా చూపించి ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ తర్వాతి సీన్లలో దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించాడు. అన్ని ప్రశ్నలకు.. సందేహాలకు సరైన సమాధానాలు ఇచ్చి ప్రేక్షకులను ఒప్పిస్తాడు. మెప్పిస్తాడు.

కథలో భాగంగా ట్విస్టులు కాకుండా.. ట్విస్టుల చుట్టూ కథలు అల్లుతూ.. వాటి మీద మొత్తం సినిమా భారం మోపుతున్న ఈ రోజుల్లో ప్రేక్షకులు కూడా తెలివి మీరిపోయారు. ముందే ట్విస్టులను ఊహించేసి ఏముంది ఇందులో అని తేల్చేస్తున్నారు. కానీ అజయ్ భూపతి 'మంగళవారం'లో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తాడు. చివరి 40 నిమిషాల్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. కొన్ని చోట్ల ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించినా.. లాజిక్స్ మిస్సయినా.. ఓవర్ ద బోర్డ్ వెళ్లినట్లు అనిపించినా.. ప్రేక్షకులను థ్రిల్ చేయగలిగాడు. పతాక సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. కానీ ఈ కథను మొదలుపెట్టిన తీరు.. ప్రథమార్ధంలో చాలా సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. ఏదో జరిగిపోతున్నట్లు హడావుడి తప్ప.. కథలో పెద్దగా కదలిక కనిపించదు ప్రథమార్ధంలో. నందిత శ్వేత.. కృష్ణచైతన్య లాంటి కొన్ని పాత్రలకు అవసరానికి మించిన బిల్డప్ ఇవ్వడం.. అనవసర సీన్లు చికాకు పుట్టిస్తాయి. హత్యలు జరగడం.. వాటికి సంబంధించి అందరినీ అనుమానాస్పదంగా చూపించడం.. ఇలా సగటు మర్డర్ మిస్టరీ బాటలోనే సాగుతాయి సన్నివేశాలు. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం వల్ల కథనం నెమ్మదిగా సాగుతున్న భావన కలుగుతుంది. ప్రథమార్ధం ఏదో అలా అలా సాగిపోయాక సెకండాఫ్ నుంచి 'మంగళవారం' ట్రాక్ లో పడుతుంది. పాయల్ పాత్ర రంగప్రవేశం చేశాక ప్రేక్షకులు సినిమాలో బాగా ఇన్వాల్వ్ అవుతారు. మొదట్లో మామూలుగా అనిపించే కొన్ని సీన్లకు చివర్లో కనెక్షన్ కుదరడంతో అవి కూడా బాగా అనిపిస్తాయి. కొంత వరకు సహనాన్ని పరీక్షించినప్పటికీ అంతిమంగా 'మంగళవారం' ఒక విభిన్నమైన థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

నటీనటులు:

'ఆర్ఎక్స్ 100' కథానాయిక పాత్రను చూశాక అది అందరు హీరోయిన్ల చేయదగ్గ పాత్ర కాదు అనిపించింది. సంచలనాత్మకంగా సాగిన ఆ పాత్రను పాయల్ ఎంతో కన్విన్సింగ్ గా పోషించి మెప్పించింది. మళ్లీ ఆమె అలాంటి ఛాలెంజింగ్-బోల్డ్ పాత్రను 'మంగళవారం'లో చేసింది. ఇందులోనూ తన అప్పీయరెన్స్.. బోల్డ్ పెర్ఫామెన్స్ చూసి షాకవుతాం. ఇది పాయల్ మాత్రమే చేయదగ్గ పాత్ర అనిపిస్తుంది. 'ఆర్ఎక్స్ 100' కంటే కూడా ఇందులో నటనకు.. ఎమోషన్లను పండించడానికి బాగా అవకాశం లభించింది. ఎంతో సంఘర్షణతో సాగే పాత్రను ఆమె పండించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. పాయల్ కే కాదు.. ప్రేక్షకులకు కూడా చాన్నాళ్లు గుర్తుండే పాత్ర ఇది. నందిత శ్వేత కొంచెం కటువుగా సాగే ఎస్ఐ పాత్రలో ఓకే అనిపించింది. తనకు డబ్బింగ్ మాత్రం సరిగా కుదరలేదు. కృష్ణచైతన్య తక్కువ నిడివిలోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రియదర్శి పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. అతన కూడా తక్కువ స్క్రీన్ టైంలోనే తన ప్రభావాన్ని చూపించాడు. చాలా వరకు సీరియస్ గా సాగే సినిమాలో అజయ్ ఘోష్ అక్కడక్కడా నవ్వులతో రిలీఫ్ ఇచ్చాడు. తన అసిస్టెంట్ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. మలయాళ నటి రియా పిళ్లై పాత్ర.. నటన బావున్నాయి. రవీంద్ర విజయ్ కూడా బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

'మంగళవారం'లో టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ ఈ తరహా మిస్టిక్ థ్రిల్లర్లకు సంగీతాన్నందించడంలో ఆరితేరిపోయాడు. తన బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కథనంలో వేగాన్ని.. ఉత్కంఠను పెంచడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. ఉన్న ఒకట్రెండు పాటలు బాగానే సాగాయి. కెమెరామన్ శివేంద్ర దాశరథి కథకు అవసరమైన విజువల్స్ అందించాడు. నైట్ ఎఫెక్ట్ లో సాగే సన్నివేశాలు.. యాక్షన్ ఎపిసోడ్లు స్టాండౌట్ గా నిలిచాయి. సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తైజుద్దీన్ సయద్-కళ్యాణ్ రాఘవ్ మాటలు సన్నివేశాలకు తగ్గట్లుగా సాగాయి. ఇక కథకుడు.. దర్శకుడు అజయ్ భూపతికి ఈ సినిమా కచ్చితంగా మంచి కమ్ బ్యాక్. 'ఆర్ఎక్స్ 100'తో పోల్చదగ్గ కథ కాదు కానీ.. అందులో మాదిరే బోల్డ్ గా ఓ కథను నరేట్ చేశాడతను. అతను చూపించిన పాయింట్ చాలా కొత్తదే. ఒక దశ వరకు సగటు హార్రర్ థ్రిల్లర్ లాగే నడిపించిన అజయ్.. చివర్లో ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో తన ప్రత్యేకతను చాటాడు. అజయ్ లోని డిఫరెంట్ రచయిత.. మంచి టెక్నీషియన్ ఈ సినిమాలో కనిపించారు.

చివరగా: మంగళవారం.. బోల్డ్ అండ్ థ్రిల్లింగ్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Tags:    

Similar News