మూవీ రివ్యూ : మంజుమ్మెల్ బాయ్స్

మలయాళం గత నెల విడుదలై 200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం.. మంజుమ్మెల్ బాయ్స్.

Update: 2024-04-06 09:05 GMT

'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ రివ్యూ

నటీనటులు: షౌబిన్ షాహిర్-శ్రీనాథ్ బాసి- బాలు వర్గీస్-శ్రీధర్ పిళ్లై-గణపతి తదితరులు

సంగీతం: సుశిన్ శ్యామ్

ఛాయాగ్రహణం:షైజు ఖాలిద్

నిర్మాతలు: షౌబిన్ షాహిర్-బాబు షాహిర్-షాన్ ఆంటోనీ

రచన- దర్శకత్వం: చిదంబరం

మలయాళం గత నెల విడుదలై 200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం.. మంజుమ్మెల్ బాయ్స్. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కేరళలోని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు కుర్రాళ్లు కొడైకెనాల్ టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఒక క్వాలిస్ వాహనంలో పది మంది ఈ పర్యటనకు బయల్దేరతారు. గ్రూప్ లో ఉన్న వాళ్లంతా అల్లరి కుర్రాళ్లే కావడంతో వెళ్లిన చోటల్లా హడావుడి చేసి.. చివరికి గుణ కేవ్స్ దగ్గరికి చేరుకుంటారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఆ గుహను బయటి నుంచే చూసి వెళ్లిపోతుంటారు పర్యాటకులు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ మాత్రం.. గార్డ్ కళ్లుగప్పి నిషేధిత ప్రాంతమైన గుహ లోపలికి వెళ్తారు. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ గ్రూప్ లోని సుభాష్ (శ్రీనాథ్ బాసి) అదుపు తప్పి ఒక భారీ లోయలోకి పడిపోతాడు. అదెంత ప్రమాదకర లోయ అన్నది తర్వాతే అతడి స్నేహితులకు అర్థమవుతుంది. అందులో పడ్డ ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తుంది. మరి అంత ప్రమాదకర లోయ నుంచి సుభాష్ బయటికి వచ్చాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

కల్పిత కథలను కూడా ఎంతో సహజంగా.. వాస్తవికంగా తీర్చిదిద్దడంలో మలయాళ దర్శకుల నైపుణ్యమే వేరు. అలాంటిది వింటుంటే ఔరా అనిపించే ఒక వాస్తవ కథలను వాళ్ల చేతిలో పెడితే ఇంకెలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఈ మధ్యే 'ది గోట్ లైఫ్' అనే సర్వైవల్ థ్రిల్లర్ వచ్చింది మలయాళం నుంచి. ఆ సినిమా చూస్తూ కదిలిపోని ప్రేక్షకుడుండడు. సర్వైవల్ థ్రిల్లర్లలో ఆశ నిరాశల సాగే బతుకు పోరాటాన్ని అభిరుచి ఉన్న దర్శకులు ఎంత బాగా చూపించగలరో 'ది గోట్ లైఫ్' చూపించింది. ఇప్పుడు మలయాళం నుంచి వచ్చిన మరో బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్.. మంజుమ్మెల్ బాయ్స్. ఇది కూడా వాస్తవ కథ ఆధారంగానే తెరకెక్కడం విశేషం. 'ది గోట్ లైఫ్' నెమ్మదిగా సాగుతూ.. తీవ్ర వేదనకు గురి చేస్తూ.. సుదీర్ఘంగా సాగడం వల్ల మన ప్రేక్షకులకు అది అంతగా రుచించలేదు. కానీ 'మంజుమ్మెల్ బాయ్స్' అలా కాదు. సరదగా మొదలై.. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. హృదయాలను తడుతూ రెండుంబావు గంటల పాటు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.

మంజుమ్మెల్ బాయ్స్.. ఒక వాస్తవ గాథ. నిజ జీవిత కథల్లో డ్రామాను పండించడం అంత తేలిక కాదు. అన్ని కథల్లోనూ సినిమాకు సరిపడా డ్రామా ఉండదు. కానీ 'మంజుమ్మెల్ బాయ్స్'లో డ్రామాకు ఏం కొదవ లేదు. సరదాగా టూర్ కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనల గురించి పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటాం. వినోదం కాస్తా విషాదంగా మారే పరిస్థితి వస్తే అప్పుడు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఆ నేపథ్యాన్నే తీసుకుని ప్రేక్షకులకు ఉత్కంఠభరిత వినోదాన్ని అందించింది 'మంజుమ్మెల్ బాయ్స్' టీం. ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగిస్తున్న కేరళకు చెందిన ఓ మిత్ర బృందం కొడైకెనాల్ పర్యటనకు ప్లాన్ చేయడం.. అక్కడ అంతా సదరాగా సాగిపోతున్న సమయంలో ఆ బృందంలోని ఒకరు పెను ప్రమాదంలో చిక్కుకోవడం.. అతణ్ని బయటికి బయటికి తీసుకురావడానికి మిత్రులంతా కలిసి చేసే పోరాటమే ఈ సినిమా. స్నేహితుల మధ్య బంధాన్ని, సరదాలను చూపిస్తూ ఒక పావుగంట నడిపిన దర్శకుడు.. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాడు. ఈ స్నేహితులు ఎంతటి అల్లరి వాళ్లో చూపిస్తూ.. ఆ తుంటరి తనం వల్ల వాళ్లు ప్రమాదంలో చిక్కుకోబోతున్న విషయాన్ని చెప్పకనే చెబుతాడు.

అత్యంత ప్రమాదకరమైన గుణ కేవ్స్ లోకి మిత్ర బృందం అక్రమంగా చొరబడడం.. అక్కడ ఉన్నట్లుండి ఒక మిత్రుడు లోయలో పడడం.. ఈ సన్నివేశాలను ఉత్కంఠ రేకెత్తించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక్కడి నుంచి కథ పాకాన పడుతుంది. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే ఆ మిత్ర బృందం స్పందన ఎలా ఉంటుందో.. వాళ్లెంత ఆందోళనకు గురవుతారో చూపించడంతో అంతకంతకూ టెన్షన్ పెరిగిపోతుంది. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తమ ఫ్రెండుని కాపాడ్డానికి ఆ మిత్ర బృందం పడే తపన.. చేసే పోరాటం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. పోలీసులు సహా అందరూ చేతులెత్తేసిన సమయంలో మిత్ర బృందం లోంచే ఓ వ్యక్తి సాహసానికి పూనుకున్నాక ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంటుంది. మనం నిజంగా ఆ గుహలో చిక్కుకున్న.. ఆ సాహసం చేస్తున్న ఫీలింగ్ కలిగేలా సదరు సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆరంభంలో తాడు లాగే పోటీలో మిత్రుల వైఫల్యాన్ని చూపించి.. చివరికి దాన్నే విజయ సోపానంగా మార్చుకున్నట్లు చూపించడం.. అలాగే ఈ స్నేహితుల చిన్నతనానికి సంబంధించిన విషయాలను సింబాలిక్ షాట్స్ ద్వారా చూపించడం దర్శకుడి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక దశ వరకు ఓ మోస్తరుగా అనిపించినా.. చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతాయి. ఒక పెద్ద కష్టం చూశాక దాన్నుంచి బయటపడ్డాక వచ్చే రిలీఫ్ గొప్ప ఆనందాన్నిచ్చినట్లే.. సినిమా చివర్లో ఒక మంచి అనుభూతి కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా రియలిస్టిగ్గా సాగే సినిమాలను ఇష్టపడేవారికి 'మంజుమ్మెల్ బాయ్స్' ఎంతో నచ్చుతుంది. కొంచె సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ.. ఒక సర్వైవల్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది.

నటీనటులు:

మలయాళంలో చాలా మంచి పేరున్న షౌబిన్ షాహిర్ నటన ఈ సినిమాలో మేజర్ హైలైట్. మిత్ర బృందంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అవసరమైనపుడు ఎంతటి సాహసానికే సిద్ధపడే పాత్రలో షౌబిన్ గొప్పగా నటించాడు. ఆ పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. లోయలోకి దిగినప్పటి నుంచి చివరి వరకు లేని ప్రపంచాన్ని ఊహించుకుంటూ హావభావాలు పలికించడంలో అతను గొప్ప ప్రతిభ చూపించాడు. ప్రమాదంలో చిక్కుకునే సుభాష్ పాత్రలో నటించిన శ్రీనాథ్ బాసి కూడా బాగా నటించాడు. మిత్ర బృందంలో మిగతా వాళ్లందరూ కూడా సహజంగా నటించారు. 'ఖైదీ' ఫేమ్ శ్రీధర్ పిళ్లై.. మిగతా సహాయ పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పరిధిలో బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

'మంజుమ్మెల్ బాయ్స్'లో సాంకేతిక నిపుణులందరూ ప్రతిభా చాటుకున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ కు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్.. కెమెరామన్ ఖాలిద్ కీలక పాత్ర పోషించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. విజువల్స్ కూడా బాగున్నాయి. అన్నింటికీ మించి ఆర్ట్ వర్క్ గొప్పగా ఉంది. ఎక్కడా అసహజంగా అనిపించకుండా సహజమైన వాతావరణం కనిపించేలా చేయడంలో ప్రొడక్షన్ డిజైన్ కీలక పాత్ర పోషించింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన షౌబిన్ షాహిరే ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరు కావడం తన అభిరుచికి నిదర్శనం. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ చిదంబరం గొప్ప పనితనం చూపించాడు. కథ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా.. ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రశంసనీయం.

చివరగా: మంజుమ్మెల్ బాయ్స్.. ఉత్కంఠతో ఊపేస్తారు

రేటింగ్: 3/5

Tags:    

Similar News