'గోట్' సినిమా వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి
మీనాక్షి క్యారక్టర్ కు ఎక్కువ స్పేస్ కూడా లేదు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. విజయ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది.
టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా చేస్తోంది. గతేడాది అర డజను చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఆమె నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి పండగకు విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ 'ది గోట్' సినిమా తర్వాత తనపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని, దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాయని తెలిపింది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన జీవితంలోని కష్టమైన అధ్యాయాన్ని పంచుకుంది. తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌లో ఆమెను చాలా ట్రోల్ చేసారని వెల్లడించింది. "గోట్ సినిమాలో నటించిన తర్వాత, నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డాను. నేను ఒక వారం పాటు డిప్రెషన్ లోకి వెళ్ళాను. కానీ 'లక్కీ భాస్కర్' చిత్రంతో నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి నుండి నేను మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టాలని అప్పుడే గ్రహించాను" అని మీనాక్షి తెలిపింది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రిభినయం చేసిన యాక్షన్ థ్రిల్లర్ ''ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్''(ది గోట్). ఇందులో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా, ప్రశాంత్, లైలా కీలక పాత్రలు పోషించారు. కథానుగుణంగా సినిమాలో మీనాక్షి పాత్రను విజయ్ పాత్ర చంపేస్తుంది. మీనాక్షి క్యారక్టర్ కు ఎక్కువ స్పేస్ కూడా లేదు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. విజయ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. ₹440−455.63 కోట్ల వసూళ్లతో 2014లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత తనపై బాగా ట్రోలింగ్ జరిగినట్లుగా మీనాక్షి చెబుతోంది.
ఇకపోతే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తోంది మీనాక్షి చౌదరి. ఇదొక ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ ల మధ్య జరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేయబడుతోంది. ఇందులో పోలీసాఫీసర్ గా, వెంకీ మాజీ ప్రేయసిగా మీనాక్షి కనిపించనుంది. పోలీస్ క్యారక్టర్ చేయాలనేది తన డ్రీమ్ అని, కెరీర్ తొలినాళ్లలోనే అలాంటి పాత్ర చేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఎంటర్టైనింగ్ గా సాగే కాప్ రోల్ నటించడం కొత్త అనుభూతిని పంచిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షితో పాటుగా మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. వెంకటేష్ భార్యగా, నలుగురు పిల్లల తల్లి పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంక్రాంతికి తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నిర్మాత దిల్ రాజు ధీమాగా ఉన్నారు. 2025 జనవరి 14న తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి 'అనగనగ ఒక రాజు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.