100 మందికి ఒకే టాయ్‌లెట్.. రోజంతా క‌డుపునొప్పితో రెయిన్ సాంగ్ చేసాను!

సెట్స్ లో మ‌హిళ‌ల కోసం స‌రైన వ‌స‌తులు లేక‌పోతే వారి ప‌రిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉంటుందో అర్థం చేసుకోగ‌లం.

Update: 2024-11-15 07:24 GMT

సెట్స్ లో మ‌హిళ‌ల కోసం స‌రైన వ‌స‌తులు లేక‌పోతే వారి ప‌రిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉంటుందో అర్థం చేసుకోగ‌లం. ముఖ్యంగా ఎమ‌ర్జెన్సీ స‌న్నివేశంలో టాయ్ లెట్లు అందుబాటులో లేకుంటే ఆర్టిస్టు ఎలాంటి గంద‌ర‌గోళానికి గుర‌వుతారో ఊహించండి. అలాంటి గంద‌ర‌గోళ ప‌రిస్థితులు, అసౌక‌ర్యాల గురించి ఇటీవ‌ల ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీపై జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక వెలువ‌డిన అనంత‌రం ప్ర‌ముఖంగా కొంద‌రు క‌థానాయిక‌లు ఈ ప‌రిస్థితుల‌పై ఓపెన‌య్యారు. సీనియ‌ర్ న‌టీమ‌ణి రాధిక స‌హా చాలామంది సెట్లో స్త్రీల‌కు స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డంపై విరుచుకుప‌డ్డారు. ఆడ‌వారి గౌర‌వం మాట అటుంచితే, వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడే చాలా వ‌స‌తులు సెట్లో అందుబాటులో లేవ‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

నిజానికి కొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు త‌ప్ప ప‌రిమిత బ‌డ్జెట్ తో పేరు ఊరు లేని బ్యాన‌ర్లు తెర‌కెక్కించే సినిమాల సెట్ల‌లో ఇలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం స‌హ‌జం. దీనిపై చాలామంది మ‌హిళా న‌టీమ‌ణులు ఆవేద‌న చెందిన సంద‌ర్భాలున్నాయి. ఇప్పుడు సీనియ‌ర్ న‌టీమ‌ణి మీనాక్షి శేషాద్రి డయేరియాతో రొమాంటిక్ రెయిన్ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్న ప‌రిస్థితిని గుర్తుచేసుకున్నారు. అప్ప‌ట్లో 100 మంది ఒకే రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని కూడా తెలిపారు.

మీనాక్షి శేషాద్రి 80 లు 90లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆప‌ద్భాంద‌వుడు చిత్రంలోను మీనాక్షి న‌ట‌న‌ను అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. క‌ళ్ల‌తోనే కోటిభావాలు ప‌లికించే అరుదైన న‌టిగా మీనాక్షిని మెగా ఫ్యాన్స్ వోన్ చేసుకున్నారు. క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన ఆప‌ద్భాంద‌వుడు జాతీయ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే.

మీనాక్షి బాలీవుడ్‌లోను అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించారు. అయితే అప్పట్లో సెట్స్‌, లొకేషన్స్‌లో అవసరమైన సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. సెట్లో 100 మందితో వాష్‌రూమ్‌ను షేర్ చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని, డయేరియాతో వర్షంలో షూట్ చేసినట్లు గుర్తుచేసుకుంది. ఒకే విశ్రాంతి గదిని ఉన్న కొన్ని స్టూడియోలు ఉన్నాయి. దాదాపు 50-100 మంది ఒకే రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించాలి. కాబట్టి ప్రత్యేక విశ్రాంతి గదులు లేవు. ప‌రిశుభ్ర‌త అనేది అసాధ్యం. మేము ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్ ధరిస్తాము. కానీ ఏదో ఒకవిధంగా జాగ్రత్తగా మేనేజ్ చేసేసాం`` అని మీనాక్షి నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు.. రోజంతా కడుపు నొప్పితో వర్షంలో షూటింగ్ చేసాన‌ని తెలిపారు. ``ఒక రోజు నాకు అతిసారం వచ్చినప్పుడు నిజంగా నా బ్యాడ్ టైమ్. నేను షూటింగ్‌లో ఉన్నాను. అది రొమాంటిక్ సాంగ్ .. రెయిన్ సీక్వెన్స్ చేయాల్సి వ‌చ్చింద‌ని గుర్తుచేసుకుంది.

మీనాక్షి శేషాద్రి 1980లలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, జీతేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా వంటి సూపర్ స్టార్‌లతో కలిసి పనిచేశారు. అయితే 1996లో చిత్ర పరిశ్రమకు దూరమై అమెరికాలో స్థిరపడ్డారు. మీనాక్షి శేషాద్రి దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. 1996 లో విరామం ఇచ్చాక‌ 1998లో స్వామి వివేకానందలో అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2016లో ఘయాల్: వన్స్ ఎగైన్ చిత్రంలో నటించింది.

మీనాక్షి నటనా జీవితం కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. దక్షిణ భారత చిత్రాలలో కూడా పనిచేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత, మీనాక్షి తిరిగి న‌టిగా రీఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Tags:    

Similar News