మినీ రివ్యూ: 'కిల్'

నిజానికి 2023 సెప్టెంబర్ లో టొరెంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో 'కిల్' సినిమా అంతర్జాతీయ సినీ ప్రముఖుల దృష్టలో పడింది. ఆ తర్వాత 2024 జూన్ లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.

Update: 2024-07-07 08:22 GMT

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న హిందీ సినిమా "కిల్". ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, అపూర్వ మెహతా, గునీత్ మోంగ కపూర్ సంయుక్తంగా నిర్మించిన హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్య, తన్య మాణిక్తలా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ జుయల్, ఆశిష్ విద్యార్థి, హర్ష ఛాయ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 'కల్కి 2898 AD' వసూళ్ల సునామీ చూసి బాలీవుడ్ స్టార్ హీరోలే వెనక్కి తగ్గిన తరుణంలో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా జూలై 5న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ మూవీ ఎలా ఉందో పబ్లిక్ టాక్ ను బట్టి తెలుసుకుందాం.

'కిల్' కథేంటంటే.. అమ్రిత్ రాథోడ్ (లక్ష్య) ఓ ఆర్మీ జవాన్. తన ప్రేయసి తులిక (తన్య) ఇష్టానికి విరుద్ధంగా జరగబోతున్న వివాహాన్ని అడ్డుకునేందుకు, ఆమె ఫ్యామిలీ ప్రయాణిస్తున్న ట్రైన్ ఎక్కుతాడు. అయితే బేణి (ఆశిష్ విద్యార్థి) నేతృత్వంలోని ఓ దొంగల ముఠా, ఆకస్మాత్తుగా రైలులోకి వచ్చి కత్తులు తుపాకులతో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేసి, నానా బీభత్సం సృష్టిస్తారు. ఆ ఘటనలో అమ్రిత్ ప్రేయసిని దోపిడీ దొంగ ఫణి (రాఘవ్ జుయల్) దారుణంగా చంపేస్తాడు. దీంతో వైలెంట్ గా మారిపోయిన అమ్రిత్.. ఆ దొంగల ముఠాపై ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా?, చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

స్టోరీ లైన్ గా చెప్పుకోడానికి చాలా సింపుల్ గా ఉన్నా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇంటెన్స్ యాక్షన్ తో ఆద్యంతం థ్రిల్ కు గురిచేసే సినిమా 'కిల్'. కథంతా దాదాపు ఓ ట్రైన్ లోనే జరుగుతుంది. ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చూడని అత్యంత హింసాత్మక సినిమా ఇదేనంటూ చిత్ర బృందం మొదటి నుంచీ ప్రచారం చేస్తూ వచ్చారు. అంతేకాదు యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందనేది ట్రైలర్ లోనే శాంపిల్ గా చూపించారు. మేకర్స్ చెప్పినట్లుగానే, ఇది మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

1 గంట 45 నిమిషాల నిడివితో ఇంతకు ముందెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్‌ యాక్షన్ ను చూపించారని.. 'కిల్' సినిమా బాలీవుడ్‌లో యాక్షన్ కొరియోగ్రఫీకి మైలురాయిగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ ప్లే విషయంలో 'సా' 'రాంగ్ టర్న్' లాంటి ఇంగ్లీష్ సినిమాల కంటే తక్కువ కాదని, 'జాన్ విక్' చిత్రాలకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ట్రైన్ లో అలాంటి అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను, వాటిని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిన బ్యాగ్రౌండ్ స్కోర్ ను మెచ్చుకుంటున్నారు.

అయితే రైల్లో జరిగే ఈ నరమేధాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. మితిమీరిన హింస, రక్తపాతం, క్రూరత్వాన్ని ఈ సినిమాలో చూపించారని.. ఇది కేవలం హార్డ్‌ కోర్ యాక్షన్ ను ఇష్టపడే వారి కోసం మాత్రమే అని అంటున్నారు. కొన్ని సన్నివేశాలను అసలు స్క్రీన్ మీద చూడలేకపోయామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమా ఎవరైనా స్టార్ హీరోకి పడుంటే, బాక్సాఫీస్ ను కిల్ చేసేదని కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి 2023 సెప్టెంబర్ లో టొరెంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో 'కిల్' సినిమా అంతర్జాతీయ సినీ ప్రముఖుల దృష్టలో పడింది. ఆ తర్వాత 2024 జూన్ లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. రిలీజ్ కు ముందే 'జాన్ విక్' ఫ్రాంచైజీని రూపొందించే హలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ మూవీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమా వచ్చిందనే విషయం కూడా పెద్దగా తెలియలేదు. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. మరి రానున్న రోజుల్లో పుంజుకొని బాలీవుడ్‌ లో యాక్షన్‌ కు ల్యాండ్‌ మార్క్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News