సింగర్‌కి అస్వస్థత.. లైవ్ విజువల్స్ వైరల్
ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మోనాలి స్పందిస్తూ కార్యక్రమ నిర్వాహకుల తీరు కారణంగానే తాను షో మద్యలోనే స్టేజ్ దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.;
సింగర్ మోనాలి ఠాకూర్ కొన్ని రోజుల క్రితం యూపీలోని వారణాసిలో స్టేజ్ షో ఇస్తూ సడెన్‌గా స్టేజ్ దిగి వెళ్లి పోయింది. ఆ సమయంలో ప్రేక్షకులు, నిర్వాహకులు తీవ్ర స్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మోనాలి స్పందిస్తూ కార్యక్రమ నిర్వాహకుల తీరు కారణంగానే తాను షో మద్యలోనే స్టేజ్ దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన టీంతో వారు ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాగాలేదు. అక్కడ ఏర్పాట్ల విషయంలోనూ మోనాలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మోనాలి ఠాకూర్ వివరణ నేపథ్యంలో వివాదం కాస్త సర్దుమనిగింది.
తాజాగా మరోసారి మోనాలి ఠాకూర్ వార్తల్లో నిలిచింది. మరోసారి ఉన్నట్లుండి స్టేజ్ దిగడంతో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈసారి ఆమె పాట పాడలేక ఇబ్బంది పడటం వల్ల స్టేజ్ దిగి పోయింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. స్టేజ్ దిగి ఆమె డైరెక్ట్‌గా ఆసుపత్రికి వెళ్లింది. గత రెండు మూడు రోజులుగా ఆమె ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. సింగర్‌కి అస్వస్థత కావడం వల్ల కార్యక్రమం మద్యలో నిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మోనాలి ఠాకూర్ ఒక పాట పాడుతున్న సమయంలోనే ఇబ్బంది పడుతున్నట్లు తల పట్టుకుంది. ఆమె ఇబ్బందికి గురి అవుతుందని ఆ సమయంలోనే అనిపించింది. అయినా పాటను పూర్తి చేసిన తర్వాతే ఆమె వెనక్కి వెళ్లింది. పాట పూర్తి అయిన కొద్ది సమయం తర్వాత తాను అస్సలు పాడలేక పోతున్నాను, తాను కనీసం ఊరిపి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అందుకే ఈ షో నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నాను అంటూ ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయింది.
ప్రస్తుతం మోనాలి ఆసుపత్రిలో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పాట పాడుతున్న సమయంలో ఆమె ఊపిరి తీసుకోలేక పోవడంతో పాటు, కళ్లు తిరగడం వంటి లక్షణాల కారణంగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. అక్కడ వైద్యుల సమక్షంలో మోనాలి కోలుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే మోనాలి తిరిగి మామూలు స్థితికి రావాలని, ఆమె చక్కగా పాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మోనాలిని మళ్లీ ఎప్పుడు స్టేజ్ పై చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై మరింత స్పష్టత రావడానికి మరి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.