ఎన్నికల ప్రచారంలో సినీ తారలు!

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి తన మద్దతు తెలిపారు.

Update: 2024-05-06 06:20 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రచార పర్వంలో సందడి చేస్తున్నారు. కొందరు ఎన్నికలకు దూరంగా ఉంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు నచ్చిన పొలిటికల్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, అభ్యర్ధులను గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి తన మద్దతు తెలిపారు. అలానే అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ లను గెలిపించాలని కోరుతూ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి చిరు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటి నుంచీ ఆ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం గమనార్హం.

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ కూడా ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనబోతున్నారు. రేపు మే 7న తన వియ్యంకుడు, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరపున వెంకీ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే తన మామ కోసం చురుకుగా ప్రచారం చేస్తోన్న ఆయన కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక మరో సూపర్ సీనియర్ నందమూరి బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోడానికి జోరుగా ప్రచారం చేస్తున్నారు.

పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ ను ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలని మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుతో పాటుగా ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మెగా మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లు తమ మేనమామను గెలిపించాలని కోరుతున్నారు. పవన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా పవన్ కు సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నారు.

సీనియర్ నటి రోజా, వైసీపీ మంత్రి రోజా మళ్ళీ గెలవడానికి దూకుడుగా ప్రచారం చేస్తోంది. సినీ హీరో, టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్.. తెలుగుదేశం, జనసేన, భాజాపా అభ్యర్ధుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాడు. 'మన కోసం మన నారా రోహిత్' అంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేసిన యాంకర్ శ్యామల.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చెయ్యాలని దూకుడుగా ప్రచారం సాగిస్తోంది.

ప్రముఖ రచయిత కోన వెంకట్ వైఎస్సార్సీపీ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు. బాపట్లలో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పోస్టులు పెడుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ కు సపోర్ట్ చేస్తూ ఇటీవల ఓ వీడియో వదిలారు. జనసేన ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం.. తిరుపతి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాతలు బన్నీ వాసు, ఎస్కెఎన్, దర్శకుడు సాయి రాజేశ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు జనసేన గెలుపు కోసం పని చేస్తున్నారు.

ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ జోగి నాయుడు మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్న కమెడియన్ అలీ.. ఈసారి ఎందుకనో వైసీపీ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. జగన్ పాలన, సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్సార్సీపీ కోసం క్యాంపెయిన్ చేస్తున్నట్లు నటుడు గౌతమ్ రాజు తెలిపారు. కమెడియన్ సప్తగిరి అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

KGF గరుడ రామ్ వైసీపీ కోసం ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో జగన్ కు సపోర్ట్ చేసిన 30 ఇయర్స్ పృథ్వీరాజ్.. ఇప్పుడు జనసేన పార్టీ గెలుపు కోసం తిరుగుతున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు మద్దతుగా భాజపా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ప్రచారం చేశారు. ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ను గెలిపించాలని బీజేపీ మద్దతుదారు, సినీ నటి నమిత ప్రచారం చేశారు. ఇలా పలువురు సినీ ప్రముఖులు తమకు నచ్చిన పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారారు.

Tags:    

Similar News