ట్రెండీ టాక్‌: త‌వ్వుకున్నోళ్ల‌కు త‌వ్వుకున్నంత‌!

స‌మ‌కాలీన ప్ర‌పంచంలో సంగీతం అనేది వింత‌గా మారిపోయింది.

Update: 2023-10-23 09:30 GMT

స‌మ‌కాలీన ప్ర‌పంచంలో సంగీతం అనేది వింత‌గా మారిపోయింది. శూన్యం నుంచి ధ్వ‌నుల్ని విని ఏ.ఆర్.రెహ‌మాన్ లాగా స్వ‌రాల్ని స‌మ‌కూర్చేది ఎంద‌రు? అంటే ఇది స‌మాధానం లేని ప్ర‌శ్న‌. వినిపించిన బాణీనే మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తుంది. త‌మ సినిమాల్లో హిట్టు కొట్టిన బాణీ నే కాపీ కొట్టి తిరిగి రిపీటెడ్ గా వినిపించే సంగీత ద‌ర్శ‌కులు మ‌న‌కు ఉన్నారు. ఇది ఎక్క‌డో వినేసిన‌ట్టే ఉందే! అని డౌట్లు పుట్టుకొస్తుంటాయి.

అయితే ఇలాంటి జ‌న‌రేష‌న్ లో కూడా .. అప్పుడ‌ప్పుడూ అయినా మెరుపుల్ని అందించే యువ సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు మ‌న‌కు. సౌత్ లో అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇదే కేట‌గిరీకి చెందుతాడు. అత‌డు రిపీటెడ్ థీమ్ ని ఉప‌యోగించుకున్నా కానీ దాంతోనే మెప్పించే స‌త్తా ఉంద‌ని చాలాసార్లు నిరూపించాడు. ప్రస్తుతం దేశంలో ఏ సంగీత దర్శకుడికి అనిరుధ్‌కు ఉన్నంత పేరు- ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ఇటీవ‌ల విడుద‌లై వ‌రుసగా సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసిన సినిమాల‌న్నిటికీ అతడే సంగీత ద‌ర్శ‌కుడు. జైలర్, జవాన్, లియో ఇవ‌న్నీ అనిరుధ్ ఖాతాలోనివే. ముఖ్యంగా బాణీల కంటే రీరికార్డింగ్ తో అద‌ర‌గొడుతున్న వాళ్ల‌లో అనిరుధ్ ఒక‌డు. అద్భుతమైన BGM తో సినిమా రేంజును అమాంతం పెంచేస్తున్న వాడిగా అత‌డిని ర‌జ‌నీ అంత‌టి వారే కీర్తించారంటే అర్థం చేసుకోవాలి. అస‌లు యావ‌రేజ్ కంటెంట్ ఉన్న జైల‌ర్ ని అత‌డు అసాధార‌ణ విజ‌యం సాధించే చిత్రంగా మ‌లిచాడు.

ఆస‌క్తిక‌రంగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన జవాన్ లో కానీ, 500 కోట్ల క్ల‌బ్ లో చేరిన‌ జైలర్ లో కానీ పాట‌ల ప‌రంగా విప‌రీత‌మైన హైప్ ఏమీ రాలేదు. ఇందులో రొటీన్ బాణీలే వినిపిస్తాయి. ఇప్పుడు లియోలోను మెరుపుల్లాంటి పాట‌లేవీ లేవు. కానీ బండి న‌డిచిపోతుంది. అయితే ఈ సినిమాల‌న్నిటికీ అత‌డు అందించి బీజీఎం-రీరికార్డింగ్ ఒక రేంజులో సినిమాని పైకి లేపిందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అందుకే అత‌డు సంగీతం అందిస్తున్న దేవ‌ర‌పైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండతో సినిమా.. గౌతమ్ తిన్ననూరితో సినిమా..అజిత్ ప్రాజెక్ట్, రజనీకాంత్ తలైవర్ తో రెండు సినిమాలు.. శంకర్ భారతీయుడు 2 వీట‌న్నిటికీ అనిరుధ్ సంగీత ద‌ర్శ‌కుడు. 2023-24 సీజ‌న్ కి అనిరుధ్ ని త‌లైవా అని కీర్తించాలి.

ఆస‌క్తిక‌రంగా ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విశ్లేషించిన‌ట్టు.. ఇంత భారీ లైన‌ప్ ఉన్న అనిరుధ్ ఏ సినిమాకి అద్భుత‌మైన ట్యూన్లు ఇస్తాడో చెప్ప‌లేం. అత‌డికి ఉన్న బిజీ షెడ్యూల్స్ లో ఎవ‌రికి జాక్ పాట్ త‌గులుతుందో కూడా ఊహించ‌లేం. అంద‌రికీ మంచి బాణీలే ఇవ్వాల‌ని ఉంటుంది. కానీ కొంద‌రికే కుదురుతుంది. సంగీతం అనేది త‌వ్వుకునే వాళ్ల‌ను బ‌ట్టి కూడా ఉంటుంది. త‌వ్వుకున్నోళ్ల‌కు త‌వ్వుకున్నంత‌. అభిరుచికి త‌గ్గ‌ట్టు వారికి ట్యూన్లు ఇవ్వ‌డం సంగీత ద‌ర్శ‌కుడి ప‌ని. ఇప్పుడు అనిరుధ్ నుంచి కొర‌టాల కానీ, శంక‌ర్ కానీ, గౌత‌మ్ తిన్న‌నూరి కానీ ఎలాంటి మ్యూజిక్ ని పిండుకుంటారు? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News