'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీ రివ్యూ
కొత్త దర్శకుడు శివ పాలడుగు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీ రివ్యూ
నటీనటులు: అజయ్ ఘోష్-చాందిని చౌదరి-ఆమని-భానుచందర్-అమిత్ శర్మ-దయానంద్ రెడ్డి తదితరులు
సంగీతం: పవన్
ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం
నిర్మాతలు: హర్ష గారపాటి-రంగారావు గారపాటి
రచన-దర్శకత్వం: శివ పాలడుగు
కామెడీ.. విలన్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించిన అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం.. మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి ఓ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం మంచి టీజర్.. ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొత్త దర్శకుడు శివ పాలడుగు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: మూర్తి (అజయ్ ఘోష్) పల్నాడులోని వినుకొండలో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. చిన్నప్పట్నుంచి సంగీతం మీద ఉన్న ఆసక్తి.. అభిరుచితో షాప్ పెట్టిన అతను.. కాలానుగుణంగా క్యాసెట్లు-సీడీల ప్రభావం పోయి తన షాప్ నుంచి పెద్దగా ఆదాయం రాకపోయినా దాన్నే నమ్ముకుని బతుకుతుంటాడు. యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన అతను.. కుటుంబ అవసరాలను తీర్చలేక సొంత ఇంట్లోనే అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. వేరే వ్యాపారం మొదలుపెట్టమని భార్య చెప్పినా వినిపించుకోని మూర్తి.. చివరికి సంపాదన కోసమే డీజే అవ్వాలనుకుంటాడు. సంజన (చాందిని చౌదరి) సాయంతో డీజేయింగ్ నేర్చుకుంటాడు కూడా. కానీ వీళ్లిద్దరి బంధాన్ని అర్థం చేసుకోని వారి కుటుంబ సభ్యులు.. వారిని అనుమానిస్తారు. ఈ క్రమంలో మూర్తి.. సంజన తమ కుటుంబాలకు దూరం అయిపోతారు. ఈ స్థితిలో వీరి జీవితాలు ఏ తీరానికి చేరుకున్నాయి.. మూర్తి అన్ని అడ్డంకులను అధిగమించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ఈ రోజుల్లో సినిమా ద్వారా మంచి చెప్పాలని చూసినా.. సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినా అటు నిర్మాతలే కాదు ఇటు ప్రేక్షకులు కూడా అమ్మో అనేస్తున్నారు. హీరో పాత్రలో ఎంత ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉంటే యువ ప్రేక్షకులకు అది అంత బాగా ఎక్కేస్తోంది. హీరో పాత్ర ద్వారా.. సినిమా ద్వారా ఎంత చెడు చూపించినా అదేమీ అభ్యంతరకరంగా అనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన పాత్రలు.. కథల తీరే వేరే దారిలో వెళ్లిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా కొందరు రచయితలు-దర్శకులు మాత్రం లీడ్ క్యారెక్టర్ని ఉత్తముడిగా చూపించి.. తమ కథ ద్వారా ప్రేక్షకులకు మంచి చెప్పాలని.. సందేశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి రచయిత-దర్శకుడే శివ పాలడుగు. ఎవరి ఆకాంక్షల కోసం ఎవరూ పని చేయకూడదని మనసుకు నచ్చింది చేయాలని చెప్పడమే కాదు.. ప్రతిభ చాటుకోవడానికి వయసుతో సంబంధం లేదని.. ఏ వయసులో అయినా కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నంచేయొచ్చని చాటే సినిమా ఇది. మరీ కొత్తగా అనిపించదు.. కొంచెం డ్రామా తగ్గింది.. కథనంలో వేగం లేదు.. ఈ కంప్లైంట్స్ పక్కన పెడితే మ్యూజిక్ షాప్ మూర్తి డీసెంట్ మూవీనే.
అజయ్ ఘోష్ అనగానే ఎక్కువగా కామెడీ క్యారెక్టర్లే గుర్తుకు వస్తాయి. అప్పుడప్పుడూ కొన్ని విలన్ పాత్రలు కూడా చేశారు. ఆయన చేసిన పాత్రల్లో చాలా వరకు చికాకు పెట్టేలా ఉంటాయి. ఆయన నటన కూడా ఓవర్ ద టాప్ స్టయిల్లో ఉంటుంది. అలాంటి నటుడితో లీడ్ రోల్ చేయించి.. తన పాత్ర పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీల్ తీసుకురావడం.. భావోద్వేగాలు పండించడం అంటే అంత తేలిక కాదు. కానీ ఈ పనిని దర్శకుడు శివ పాలడుగు విజయవంతంగా చేశాడు. అతను ప్రధాన పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచగలిగాడు. ఆరంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోనే మూర్తి పాత్ర మీద ప్రేక్షకులకు ఒక ఆపేక్ష ఏర్పడుతుంది. పాత్ర తాలూకు అమాయకత్వం.. నిస్సహాయత.. తపనను ప్రేక్షకులకు అర్థమయ్యేలా అజయ్ ఘోష్ కూడా చక్కగా నటించడం వల్ల ఈ పాత్ర లవబుల్ గా తయారవుతుంది. మూర్తి పాత్రతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాక కథనం సాఫీగా సాగిపోతుంది. మూర్తి తరహాలోనే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేక తన అభిరుచికి తగ్గట్లు సాగలేకపోతున్న ఆధునిక అమ్మాయిగా చాందిన చౌదరి పాత్ర కూడా బాగుంది. కాకపోతే మూర్తి క్యారెక్టర్ డిఫెన్సివ్ గా ఉంటే.. చాందిని చేసిన సంజన పాత్ర అగ్రెసివ్ గా ఉంటుంది. వీరి మధ్య స్నేహ బంధాన్ని చూపించిన తీరు బాగుంది. సినిమాలో కాన్ఫ్లిక్ట్ కు కూడా ఈ రిలేషన్ నే వాడుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఆ సీన్లు కూడా బాగా పండాయి. ముఖ్యంగా తన తండ్రితో చాందిని చెప్పే డైలాగ్స్.. పోలీస్ స్టేషన్లో అజయ్ ఘోష్ సంభాషణలు స్ట్రైకింగ్ గా అనిపిస్తాయి.
ఒక మంచి మలుపు దగ్గర మ్యూజిక్ షాప్ మూర్తి విరామం వస్తుంది. ప్రథమార్ధంలో డ్రామా సహా అన్ని రకాలుగా మ్యూజిక్ షాప్ మూర్తి ఓకే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో మాత్రం ఆ టెంపో కొనసాగలేదు. ఇంటి నుంచి బయటికి వచ్చేసి సిటీకి చేరిన మూర్తి డీజే కావడానికి చేసే ప్రయత్నాలు.. ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ కూడా రొటీన్ అనిపిస్తాయి. కొన్ని సీన్లు సాగతీతగానూ సాగడం మైనస్ అయింది. చాందిని పాత్ర పూర్తి అంతర్ధానం అయిపోవడం వల్ల కూడా జోష్ తగ్గిపోతుంది. ఒక స్ట్రగుల్ తర్వాత మూర్తి పాత్ర రైజ్ అయ్యే విధానం కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగుతుంది. పతాక సన్నివేశాల్లో ఎమోషన్ బాగానే పండింది. కానీ సర్ప్రైజులైతే ఏమీ ఉండవు. ద్వితీయార్ధంలో కూడా కొంచెం డ్రామా.. మలుపులు ఉండి ఉంటే మ్యూజిక్ షాప్ మూర్తి ప్రత్యేకమైన చిత్రంగా నిలిచేది. ఈ లోపాలున్నప్పటికీ ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం ఈ మూవీ ఇస్తుంది.
నటీనటులు: అజయ్ ఘోష్ ను ఇప్పటిదాకా చూసిన కోణాలకు భిన్నమైన పాత్ర.. నటనను 'మ్యూజిక్ షాప్ మూర్తి'లో చూడొచ్చు. మామూలుగా ఆయనకు ఎక్కువగా హడావుడి పాత్రలే వస్తుంటాయి. ఇందులో మాత్రం ఆర్ద్రతతో కూడిన క్యారెక్టర్ చేశాడు. చాలా చోట్ల ఆయన నటన హృద్యంగా అనిపించి కళ్లను తడి చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే దృష్టి మారుతుంది. చాందని చౌదరి ఇండివిడువాలిటీ ఉన్న మోడర్న్ అమ్మాయి పాత్రను చక్కగా పోషించింది. ఆమె కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర. ఆమని సంప్రదాయ భార్య పాత్రలో ఒదిగిపోయింది. చాందిని తండ్రి పాత్రలో భాను చందర్ కూడా మెప్పించాడు. అమిత్ శర్మ.. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం: మ్యూజిక్ షాప్ మూర్తికి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. పవన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు చార్ట్ బస్టర్స్ అనలేం కానీ.. సినిమా ఫ్లోలో బాగానే సాగిపోయాయి. నేపథ్య సంగీతంలో మంచి ఫీల్ ఉంది. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ కూడా ప్లెజెంట్ గా సాగింది. నిర్మాణ విలువలు ఓ చిన్న సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇలంటి కథను ఓకే చేసి.. అజయ్ ఘోష్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలను అభినందించాలి. రైటర్-డైరెక్టర్ శివ పాలడుగు విషయానికి వస్తే.. అతను ఓ మంచి సందేశాత్మక కథను చెప్పాలనుకున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి కథతో సినిమా తీయాలనుకోవడం సాహసమే. రచయితగా శివ మంచి మార్కులే వేయించుకున్నాడు. అతను రాసుకున్న కొన్ని సీన్లు.. అలాగే డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఐతే దర్శకుడిగా శివ పనితనం యావరేజ్ అనిపిస్తుంది.
చివరగా: మ్యూజిక్ షాప్ మూర్తి.. ఓ మంచి ప్రయత్నం
రేటింగ్-2.75/5