నా సామిరంగ.. సడన్ ట్విస్ట్ ఇవ్వరుగా..?
ఇప్పుడు టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నడూలేనంతలా ఈసారి ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నడూలేనంతలా ఈసారి ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీపడనున్నాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి.
అయితే 2024 సంక్రాంతికి ఒక దశలో ఏకంగా అర డజను సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. తర్వాత అందులోనుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ తప్పుకుంది. కానీ మిగతా ఐదు సినిమాల్లో మాత్రం ఏదీ తగ్గేలా కనిపించడం లేదు. పక్కా సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు మేకర్స్. దీంతో ఈ సినిమాలకు థియేటర్ల కేటాయింపు ఆషామాషీ విషయం కాదు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. సంక్రాంతి బరిలో ఉన్న ఐదు సినిమాల నిర్మాతలతో సమావేశాన్ని నిర్వహించిన దిల్ రాజు.. అవకాశం ఉన్న వాళ్లు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆ సమయంలో హనుమాన్ రిలీజ్ వాయిదా వేసుకోవాలని ఆ సినిమా దర్శక నిర్మాత ప్రశాంత్ వర్మపై దిల్ రాజు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.
కానీ తాము మాత్రం పక్కాగా జనవరి 12వ తేదీనే హనుమాన్ ను రిలీజ్ చేస్తామని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారట. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించామని, నార్త్ ఇండియా రిలీజ్ ను వదులుకోలేమని తెలిపారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు నాగార్జున నా సామిరంగా సినిమా ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదట. ఓటీటీతోపాటు శాటిలైట్ హక్కుల డీల్స్ కూడా ఇంకా కుదరలేదట. వీటన్నంటికీ ఇంకా టైమ్ పడుతుందట. అందుకే రిలీజ్ ను వాయిదా వేసుకోవాలని మిగతా డిస్ట్రిబ్యుూటర్లు సూచిస్తున్నారట.
అయితే సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాలతో సంక్రాంతి సెంటిమెంట్ ను బాగా వాడుకున్న నాగార్జున.. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదాకు ఒప్పుకోరని టాక్ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
ఇక ఈ సినిమా విషయానికొస్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.