'గేమ్ ఛేంజర్'పై కామెంట్స్.. నాగవంశీ క్లారిటీ!
దీనిపై తాజాగా నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ సినిమాని తక్కువ చేసే సెన్స్ లో ఆ కామెంట్స్ చేయలేదని తెలిపారు.
టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లలో 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' ఒకటి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తుతం ఈ బ్యానర్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మీడియా ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలలో ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ మాట్లాడుతూ, రాబోయే సంక్రాంతి సీజన్‌కు పెద్ద పోటీ లేదని, అందుకే తాము NBK109 విడుదలకు వెళ్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసాయి. 'గేమ్ ఛేంజర్'ను తక్కువ చేస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేసారు. దీనిపై తాజాగా నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ సినిమాని తక్కువ చేసే సెన్స్ లో ఆ కామెంట్స్ చేయలేదని తెలిపారు.
ఇటీవల నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఈసారి దాదాపు ఆరు సినిమాలు వస్తున్నాయి.. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదా అని నన్ను అడిగారు. సంక్రాంతికి అన్ని సినిమాలు విడుదల కావని తెలుసు.. అందుకే కాంపిటేషన్ ఉండదు అనే సెన్స్ లో నేను సమాధానం చెప్పాను. ఈసారి ఆరు సినిమాలు రావు. మ్యాగ్జిమమ్ మూడు సినిమాలు వస్తాయి. ఆ సెన్స్ లోనే అంత పోటీ ఏమీ ఉండదు అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో వేరే విధంగా క్రియేట్ చేసారు. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' వచ్చినా పెద్ద కాంపిటీషన్ కాదు అని వంశీ అన్నాడు అని ప్రచారం చేసారు. అసలు ఏమన్నా అర్థం ఉందా?'' అని ప్రశ్నించారు.
''ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్ వార్స్ చేసుకునే బ్యాచ్, నేను ఒక సెన్స్ లో చెబితే దాన్ని ఇంకో సెన్స్ లో తీసుకెళ్లారు. ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి గానీ, హీరోల సైడ్ నుంచి గానీ.. ఒక హెల్తీ కాంపిటేషన్ లో సినిమాలు రావాలని పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. చిన్న స్టేట్మెంట్ ను కూడా ఇలా వక్రీకరించారు. ఒక ప్రొడ్యూసర్ గా ఇంకో సినిమాని తక్కువ చేయాలని అసలు ఎవరైనా ఎందుకు అనుకుంటారు. భవిష్యత్ లో ఆ హీరోతో కూడా పని చేయాలని అనుకుంటారు కదా. ఆ మాత్రం ఆలోచించకుండా అలా క్రియేట్ చేస్తున్నారు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి'' అని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేసారు.
2025 సంక్రాంతి సీజన్ లో 'గేమ్ ఛేంజర్' తో పాటుగా నందమూరి బాలకృష్ణ NBK109 సినిమా కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాల గ్యాప్ ఉంటుందని నాగవంశీ తెలిపారు. ''రిలీజ్ కోసం బాలకృష్ణ మంచి డేట్ చూసి చెప్తా అన్నారు. దాని కోసం వెయిట్ చేస్తున్నాం. డేట్ చెప్పిన వెంటనే అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉంటుంది. చిరంజీవి 'విశ్వంభర' ప్లేస్ లో 'గేమ్ ఛేంజర్' వస్తోంది. వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుందో లేదో.. ప్లానింగ్ లో ఉందో లేదో ఇంకా తెలియదు. ముందు అనుకున్నారు కానీ, రెండు సినిమాలు ఒకే ప్రొడక్షన్ లో రాబోతున్న చిత్రాలు కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ ఏంటో నాకు తెలియదు'' అని వంశీ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్న 'లక్కీ భాస్కర్' సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.