ఎన్టీఆర్ ను సైడ్ చేసిన బాలయ్య?.. ఫ్యాన్స్‌కు డాకు నిర్మాత రిక్వెస్ట్!

ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సినిమాని విస్మరించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

Update: 2025-01-04 14:17 GMT

సోషల్ మీడియాలో ఇప్పుడు నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. కొందరు బాలకృష్ణకు సపోర్టుగా నిలుస్తుండగా.. మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం తారక్ ప్రస్తావన లేకుండా 'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షోని నడిపిస్తుండటమే అని అర్థమవుతోంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సినిమాని విస్మరించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షో తాజా ఎపిసోడ్ లో 'డాకు మహారాజ్' టీమ్ సందడి చేశారు. దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబీ ఇప్పటి వరకూ వర్క్ చేసిన హీరోల గురించి చెప్పమని బాలకృష్ణ షోలో కొన్ని ఫోటోలను ప్రదర్శించారు. రవితేజ (పవర్), పవన్ కల్యాణ్ (సర్దార్ గబ్బర్ సింగ్), వెంకటేష్- నాగచైతన్య (వెంకీమామ), చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలయ్య (డాకూ మహారాజ్) గురించి బాబీ మాట్లాడారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఫోటోని చూపించలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ''జై లవకుశ''. అప్పటికి ఇది దర్శకుడికి అతి పెద్ద సక్సెస్. 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి డిజాస్టర్ తర్వాత తారక్ అతనికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో బాబీ అన్ స్టాపబుల్ గా ముందుకు సాగుతున్నారు. డైరెక్టర్ కెరీర్ లో అంత ఇంపార్టెంట్ అయిన సినిమాని, హీరోని బాలయ్య టాక్ షోలో మెన్షన్ చేయకపోవడం ఎన్టీఆర్ అభిమానులను బాధ పెట్టినట్లు తెలుస్తోంది.

అంతకముందు 'అన్ స్టాపబుల్' షోలో 'లక్కీ భాస్కర్' టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ లోనూ ఎన్టీఆర్ సినిమాని ఇగ్నోర్ చేశారు. నిర్మాత నాగవంశీ అన్ స్టాపబుల్ మూమెంట్స్ గురించి చెబుతున్నప్పుడు 'అజ్ఞాతవాసి'తో దెబ్బ తిన్న తర్వాత వచ్చిన సినిమాలను ప్రస్తావించారు. కానీ అక్కడ 'అరవింద సమేత' మూవీ చెప్పకుండా, నేరుగా 'అల వైకుంఠపురములో' చిత్రం గురించి చెప్పారు. ఇప్పుడు బాబీ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ తో షూట్ చేసిన ఎపిసోడ్ లోనూ RRR కోస్టార్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని టాక్.

ఇటీవల కాలంలో బాలకృష్ణ - ఎన్టీఆర్ ల మధ్య దూరం పెరుగుతోందనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో.. 'అన్ స్టాపబుల్' టాక్ షోలో ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ నాలుగు సీజన్లు జరిగితే, ఒక్కదానికి కూడా తారక్ ను లేదా కల్యాణ్ రామ్ ను గెస్టులుగా తీసుకురాలేదు. దీనికి తోడు షోలో అసలు తారక్ పేరు వినిపించకుండా చేస్తున్నారనే రూమర్లు వస్తున్నాయి. మరి ఇదంతా బాలయ్యకు తెలిసే జరుగుతోందా? లేదా షో నిర్వాహకులు ఇలా చేస్తున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో 'డాకు మహారాజ్' సినిమాని బాయ్ కాట్ చేస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే నిర్మాత నాగవంశీ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. "ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వటానికి ప్రయత్నిద్దాం" అని పేర్కొన్నారు. ఓవైపు 'దబిడి దబిడి' సాంగ్ పై ట్రోలింగ్, మరోవైపు తారక్ ఫ్యాన్స్ సినిమా చూడబోమని ట్వీట్స్ పెడుతున్న తరుణంలో వంశీ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తారక్ అభిమానుల సపోర్టు కూడా ఈ సినిమాని ఉండాలనే ఉద్దేశ్యంతోనే నిర్మాత ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News