'నమో నమః శివాయ'.. 'తండేల్' జోడీ శివ తాండవం..!

ఈ క్రమంలో తాజాగా "నమో నమః శివాయ" అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు.

Update: 2025-01-04 13:22 GMT

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ''తండేల్''. యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన "బుజ్జి తల్లి" పాట సెన్సేషనల్ హిట్ అయింది. యూట్యూబ్ లో 44 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. లక్షల కొలదీ రీల్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా "నమో నమః శివాయ" అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు.


''నమో నమః.. నమో నమః.. నమో నమః శివాయ.. హే ఢమ ఢమ ఢమ అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు.. అష్టదిక్కులు అదిరెటట్టు.. తాండవేశ్వరా.. భం భం భం మొదలుపెట్టు.. అమృతాన్ని పంచిపెట్టు.. గుండె వెండికొండయ్యేట్టు.. కుండలేశ్వరా'' అంటూ సాగిన ఈ పాట ఆడియన్స్ ను డివైన్ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసారు. ట్రెడిషనల్ సౌండింగ్ కి మోడరన్ బీట్స్ మిళితం చేసి ఈ పాటను ట్యూన్ చేసారు. పాట వింటున్నంతసేపూ శరీరమంతా పులకించిపోయేలా, భక్తితో ఆనంద తాండవం చేసేలా డీఎస్పీ స్వరాలు సమకూర్చారని చెప్పాలి.

శివ శక్తి పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అద్భుతమైన సాహిత్యం రాశారు. ''తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా.. వేడుకుంటే విషాన్నైనా మింగినావురా.. ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా.. సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా'' అంటూ శివుని సర్వశక్తిని, శివ తత్వాన్ని, ఆధ్యాత్మిక సారాన్ని తన లిరిక్స్ ద్వారా తెలియజెప్పారు. సింగర్ అనురాగ్ కులకర్ణి డైనమిక్‌ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. గాయని హరిప్రియ తన మనోహరమైన స్వరంతో ప్రశాంతతను జోడిస్తుంది.

"నమో నమః శివాయ" పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్లతో చేసిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్ గా నిలిచింది. డ్యాన్స్ ద్వారానే శివ శక్తి కథను అందంగా వివరించారు. గతంలో 'లవ్ స్టోరీ'లో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నాగ చైతన్య - సాయి పల్లవి జంట.. ఈ పాటలో మరోసారి మెస్మరైజ్ చేసారు. నాగ చైతన్య ఇంతకముందెన్నడూ చూడని విధంగా చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయగా.. సాయి పల్లవి తన గ్రేస్ ఫుల్ స్టెపులతో ఆకట్టుకుంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన పల్లవితో పోటీ పడుతూ చైతూ డ్యాన్స్ చేశారని చెప్పాలి.

విజువల్ గానూ "నమో నమః శివాయ" పాట చాలా గ్రాండియర్ గా ఉంది. జాతర బ్యాక్ డ్రాప్ లో శివ శక్తిని ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన సెట్ ను నిర్మించారు. దానికి తగ్గట్టుగానే హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్, కలర్ గ్రేడింగ్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ పాట శివుని మహిమను జరుపుకునే వేడుకలా,శివ పార్వతులకు ఒక మ్యూజికల్ ట్రీట్ గా ఉంది. "బుజ్జి తల్లి" మాదిరిగానే ఈ సాంగ్ కూడా ఇన్స్టెంట్ చార్ట్‌ బస్టర్‌ గా నిలిచింది. రాబోయే రోజుల్లో వచ్చే ఫెస్టివల్స్ లో, ఉత్సవాలు, తిరునాళ్లలో, మహా శివరాత్రి వేడుకల్లో ఈ పాట మారుమ్రోగే అవకాశం ఉంది. 'నమో నమః శివాయ' గీతాన్ని తెలుగుతో పాటుగా హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ''తండేల్'' సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 2025 వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 7వ తేదీన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.



Full View


Tags:    

Similar News