చెప్పి మరి కొట్టిన నాని.. కిర్రాక్ జడ్జిమెంట్!

సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నచ్చకుంటే తన హిట్ 3 సినిమా చూడక్కర్లేదని డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.;

Update: 2025-03-13 09:39 GMT

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కూడా సినిమాల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూనే ఉంటాడు. కొత్త కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ, తానే స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆయన కోర్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. దీని మీద అతనికి ఉన్న నమ్మకం మాటల్లోనే కాదు, పనితీరులోనూ స్పష్టంగా కనిపించింది.


సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నచ్చకుంటే తన హిట్ 3 సినిమా చూడక్కర్లేదని డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాధారణంగా హీరోలు తమ సినిమాలను పాజిటివ్‌గా ప్రమోట్ చేసుకోవడం కామన్. కానీ నాని మాదిరిగా ఓ సినిమా మీద అంతగా నమ్మకం పెట్టుకుని, ప్రేక్షకులకు ఓపెన్‌గా ఛాలెంజ్ విసరడం చాలా అరుదు. ఇంతకంటే ముందు కూడా దసరా సినిమా విషయంలో తన కాన్ఫిడెన్స్‌ను ప్రూవ్ చేసుకున్నాడు.

కంటెంట్ ఉన్న సినిమా అయితే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నాని మరోసారి నిరూపించాడు. ఈసారి కోర్ట్ సినిమాతోనూ అదే జరిగింది. కోర్ట్ ఓ కాస్త సీరియస్ డ్రామా ఉన్న సినిమా. పొక్సో చట్టానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ, న్యాయపరమైన డ్రామాతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా రూపొందించారు. ఇటువంటి కథలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడవనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ నాని మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు.

కంటెంట్ బలంగా ఉంటే, ఎలాంటి కథనమైనా ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని అతని నమ్మకం మరోసారి నిజమైంది. సినిమా విడుదలకు ముందే జరిపిన మీడియా ప్రీమియర్ చూసినవారంతా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారు. ముఖ్యంగా, ప్రియదర్శి, శివాజీ వంటి నటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడిని నాని ఇంతగా ప్రోత్సహించడం గొప్ప విషయమే కాదు, కంటెంట్ ఆధారంగా ఓ సినిమా విజయం సాధించగలదని మరోసారి రుజువు కావడం విశేషం.

సినిమా కథనం, స్క్రీన్‌ప్లే, పాత్రల బలమైన ప్రస్థానం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాని ప్రమోషన్ స్ట్రాటజీ చూస్తే, అతను మార్కెట్ సూత్రాలను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరి హీరోలు కేవలం సినిమాల బిజినెస్‌కు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితుల్లో, నాని మాత్రం తన జడ్జ్‌మెంట్‌ను నమ్మి ప్రయోగాత్మకమైన సినిమాలను ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఇదే అతనికి హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది.

ఈ విజయం నానికి మళ్లీ తన జడ్జ్‌మెంట్ మీద మరింత నమ్మకాన్ని పెంచేలా ఉంది. ముందు ముందు కూడా ఇదే తరహా విభిన్నమైన సినిమాలను అందించేందుకు ప్రయత్నిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు నాని చెప్పిన మాటలు వృధా కాలేదు. మరి వచ్చే హిట్ 3 కూడా అతని జడ్జ్‌మెంట్‌కు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News