నాని తెలివిగా తప్పించుకున్నాడా..?

కానీ నాని మాత్రం అన్నీ అలోచించి తన ఇమేజ్, మార్కెట్ లెక్కలు వేసుకొని 'వేట్టయన్' ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారు.

Update: 2024-10-11 07:30 GMT

మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలే మన కెరీర్ ను ఉన్నత స్థానంలో నిలబెడతాయి. అందుకే ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకోవాలి.. లేకపోతే కెరీర్ అగాధంలోకి నెట్టివేయబడే పరిస్థితి వస్తుంది. టాలీవుడ్ లో రైట్ డెసిషన్స్ తీసుకుంటూ, కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉంటాడు. ఒకే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సినిమా సినిమాకూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు ఆయన డెసిషన్ మేకింగ్ ను తెలియజేస్తాయి. దీనికి ఉదాహరణగా మనం 'వేట్టయన్' 'లాల్ సింగ్ చద్దా' లాంటి సినిమాలను చెప్పుకోవచ్చు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'వేట్టయన్' సినిమా నిన్న విడుదలైంది. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞాన్ వేల్ తెరకెక్కించి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటించారు. నిజానికి ఈ మూవీలో హీరో నాని నటించాల్సింది. రజనీ, అమితాబ్ లు కథ ఓకే చేసిన తర్వాత కీలకమైన పాత్రల కోసం మేకర్స్ ముందుగా నానీని సంప్రదించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కథను కూడా వినిపించారని, ఫాఫా పోషించిన ఇంఫార్మర్ పాత్ర లేదా నెగిటివ్ షేడ్స్ ఉన్న రానా పాత్ర రెండింట్లో ఒకటి ఆఫర్ చేశారని అనుకున్నారు. కానీ నాని దాన్ని సున్నితంగా తిరస్కరించారట.

రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజండరీ యాక్టర్స్.. నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కాంబోలో రూపొందే సినిమాను రిజెక్ట్ చేయడానికి ఏ నటుడైనా ఆలోచిస్తారు. కానీ నాని మాత్రం అన్నీ అలోచించి తన ఇమేజ్, మార్కెట్ లెక్కలు వేసుకొని 'వేట్టయన్' ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారు. నిన్న సినిమా చూసిన ఆడియన్స్ అతను సరైన నిర్ణయమే తీసుకున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ పరంగా నాని ఈ చిత్రానికి హెల్ప్ అయ్యేవాడే కానీ, నాని కెరీర్ కు మాత్రం ఈ సినిమా ఏమాత్రం హెల్ప్ అయ్యేదికాదని కామెంట్స్ చేస్తున్నారు.

'వేట్టయన్' సినిమాలో ఫహాద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి పాత్రలకు మంచి పేరే వస్తోంది. దర్శకుడు ఆ రెండు పాత్రల్లో ఒకదాని కోసం నానీని సంప్రదించారో లేదో అధికారికంగా తెలియదు కానీ, ఆ క్యారెక్టర్స్ నానికి పెద్దగా ఉపయోగపడేవి కాదనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి నేచురల్ స్టార్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని అనుకోవచ్చు. ఇంతకముందు 'లాల్ సింగ్ చద్దా' సినిమా విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. అక్కినేని నాగచైతన్య పోషించిన బాల పాత్ర కోసం అమీర్ ఖాన్ ముందుగా నానీనే సంప్రదించారు. కానీ బాలీవుడ్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో నాని తెలివిగా తప్పించుకున్నాడని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి నాని డెసిషన్ మేకింగ్ చర్చల్లోకి వచ్చింది.

ఇకపోతే 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించారు నాని. ఈ ఉత్సాహంతో ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో తన హోమ్ బ్యానర్ లో 'హిట్ 3: ది థర్డ్ కేస్' మూవీలో నటిస్తున్నారు. విజయదశమి సందర్భంగా శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తన రెండో చిత్రాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News