మూర్తి గారి చిరాకు..ఇంతలోనే హీరో తెలివైన పని!
ఇప్పుడు ఆయన ఒక సినిమా ప్రచారంలో కనిపించారు. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్‌ను నారాయణమూర్తి ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ - ఏఎన్నార్ కాలం నుంచి వారి అభిమానిగా పరిశ్రమలో కొనసాగిన ఆర్.నారాయణ మూర్తి నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక పంథా ఉందని నిరూపించారు. విప్లవ చిత్రాల దర్శకుడిగా .. బడుగు బలహీన వర్గాలు, గిరిజన బిడ్డల కథల్ని తెరపై ప్రతిబింబించే దార్శనికుడిగా, ఎర్ర జెండా ఫాలోవర్‌గా ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. పూరి జగన్నాథ్- త్రివిక్రమ్ లాంటి కమర్షియల్ దర్శకులు తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నించినా అది నా జానర్ కాదు అంటూ అవకాశాల్ని వదులుకున్న నాన్ కమర్షియల్ మనిషి ఆయన. ఇక సబ్జెక్ట్ ఏదైనా వేదికలకెక్కితే అసాధారణంగా మాట్లాడగలిగే జ్ఞాని అతడు. సింప్లిసిటీలో ఇక ఆయనను కొట్టేవాళ్లే లేరు. అందుకే ఆర్.నారాయణ మూర్తిని అభిమానించని పరిశ్రమ వ్యక్తి లేరు.
ఇప్పుడు ఆయన ఒక సినిమా ప్రచారంలో కనిపించారు. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్‌ను నారాయణమూర్తి ఆవిష్కరించారు. చిత్రకథానాయకుడు సుహాస్‌తో కలిసి పనిచేసిన పలువురు చిత్రనిర్మాతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ లాంచ్ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. టీజర్ లాంచ్‌ను పురస్కరించుకుని నిర్వాహకులు సినిమా థీమ్‌ను ప్రతిబింబించే మ్యూజికల్ బ్యాండ్‌ని ఏర్పాటు చేశారు. ఇది ప్రచారానికి సహకరించే ఎత్తుగడ. అయితే మ్యూజికల్ బ్యాండ్ ఈవెంట్‌లో ఇబ్బందికర శబ్దాన్ని సృష్టించడంతో అది కొంత అసౌకర్యానికి కారణమైంది.
మీడియా కథనాల ప్రకారం.. ఈవెంట్ ప్రాంగణంలో ఉన్న ఆర్ నారాయణ మూర్తి మ్యూజికల్ బ్యాండ్ సృష్టించిన హడావుడిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సినిమా కథానాయకుడు సుహాస్ వెంటనే దీనిని గమనించి తన బృందం తరపున అహూతులకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. పరిస్థితికి సుహాస్ వేగంగా స్పందించడం ఈవెంట్‌కు హాజరైన చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇది తెలివైన నిర్ణయం. వేగంగా స్పందించి, తనదైన శైలిలో వినయాన్ని ప్రదర్శించి పరిస్థితిని సద్ధుమణిగేలా చేసాడు.
ఇటువంటి వ్యక్తిత్వం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. హీరోగా అతడు ఎదిగేందుకు ఇలాంటివి సోపానంగా మారుతాయనడంలో సందేహం లేదు. అల్లు అరవింద్ GA2 పిక్చర్స్ సమర్పణలో మహాయాన పిక్చర్స్ పతాకంపై వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని నిర్మించారు. దుష్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.