అక్కడ చరణ్‌ పై బాలయ్యదే పైచేయి!

తెలుగు సినిమాల విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది.

Update: 2024-10-26 05:08 GMT

తెలుగు సినిమాల విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ సమయంలో తమ తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శకులతో పాటు హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే అప్పుడు వరుసగా సెలవలు ఉండడంతో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు కాబట్టి. అలా వచ్చే ఏడాది కూడా చాలా పెద్ద చిత్రాలు పోటీలో నిలవనున్నాయి.

2025 సంక్రాంతికి కూడా ఎప్పటి లాగానే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’తో పాటు నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న NBK109 మూవీ పొంగల్ బరిలో నిలిచినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.

వాస్తవానికి ప్రతి ఏడాది సంక్రాంతికి మెగా, నందమూరి హీరోల మధ్య పోటీ ఆసక్తికంగా మారుతూ ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ చాలా సార్లు పొంగల్ బరిలో నిలిచి పండుగను రసవత్తరంగా మార్చారు. ఈ సారి మాత్రం చిరు స్థానంలో ఆయన కుమారుడు రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’, బాలయ్య మూవీతో పాటు బరిలో నిలవబోతున్న విషయం తెలిసిందే.

‘గేమ్ చేంజర్’, బాలయ్య సినిమాకు మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో వీటిలో ఏది హిట్ అవుతుంది? దేనికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? ఏ మూవీకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఏరియా బిజినెస్ విషయంలో రామ్ చరణ్ కంటే బాలయ్యదే పైచేయి అన్న న్యూస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ఏరియాకు ప్రత్యేకత ఉంది. అయితే, ఇక్కడ టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు మాత్రమే ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన నటించిన చిత్రాలకు అక్కడ భారీ రెస్పాన్స్ వస్తుంది. అందుకే NBK109 సినిమాకు ఏకంగా 19 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ అని సమాచారం.

రామ్ చరణ్‌కు కూడా సీడెడ్‌లో మంచి మార్కెట్ ఉంది. కానీ, ‘గేమ్ చేంజర్’ సినిమాకు అక్కడ కేవలం రూ. 15 కోట్లు బిజినెస్ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అలా ఈ ఏరియాలో బాలయ్య.. చరణ్‌పై పైచేయి చూపించాడని సమాచారం. ఇప్పుడు దీన్ని నందమూరి ఫ్యాన్స్ హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Tags:    

Similar News