ఇండస్ట్రీ మార్పు కోసం నీల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
రీసెంట్ గా స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ సినిమా చూడటం వేరు తీయడం వేరు అని చెప్పుకొచ్చారు.;
ఒక సొంత కథ రాసుకుని డైరెక్టర్ గా మారాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తమకంటే తోపులు ఎవరు లేరన్నట్టుగా ఫీల్ అవుతారు. ఐతే అసలు విషయం ఏంటన్నది వాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చాక కానీ అర్థం కాదు. ఇదే విషయాన్ని తన అనుభవాలుగా చెప్పాడు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రీసెంట్ గా స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ సినిమా చూడటం వేరు తీయడం వేరు అని చెప్పుకొచ్చారు.
తను ఉగ్రం సినిమా తీయడానికి ముందు వరకు సినిమా డైరెక్టర్స్ అంతా కూడా బ్యాడ్ అనుకునే వాడినని అన్నారు ప్రశాంత్ నీల్. ఇండస్ట్రీలో మార్పు తీసుకు రావాలని తాను అనుకునే వాడినని అన్నారు. ఐతే మొదటి సినిమా కొంత పార్ట్ షూట్ అయ్యాక సినిమా కష్టం అంటే ఏంటో అర్ధమైందని అన్నారు. ఆ టైం లో తన సినిమా ఒక పదిమంది చూసినా చాలని అనుకున్నానని అన్నారు ప్రశాంత్ నీల్.
ఇదే కార్యక్రమంలో సినిమా మేకింగ్ తాను క్రికెట్ అనుకున్నా కానీ అది టెన్నిస్ అని అన్నారు. ఇక్కడ టీం వర్క్ ఉంటేనే విజయం వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ సినిమా తీయకముందు ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పి ఆ ఆసక్తి ఉన్న ఫిల్మ్ స్టూడెంట్స్ కి రియాలిటీ ఎలా ఉంటుందో చెప్పేందుకు సహకరించారు.
ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాతో మొదలు పెట్టి కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సలార్ 1 సీజ్ ఫైర్ తో సత్తా చాటాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమాను ఊహించడం వేరు తెర మీద ఆ ఊహను తీసుకు రావడం వేరు అలా తమ ఆలోచనని తెర మీదకు తీసుకొచ్చిన వారు సక్సెస్ అవుతారు. ఐతే ఈ ఫార్ములా చాలామందికి తెలిసినా కూడా సరైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేక సక్సెస్ అవ్వలేకపోతారు.
ప్రశాంత్ నీల్ కూడా తానొక గొప్ప దర్శకుడు అవ్వాలనే కలలు కనే నేడు దాన్ని తన ప్రతిభతో సాధించాడు. ఐతే సినిమా తీయడం అన్నది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అయినా ఫైనల్ గా అందరు చేసే ఈ ప్రయత్నం ప్రేక్షకుడిని మెప్పించాలని తెలుసుకోవాల్సిందే.