'జైలర్' సీక్వెల్ కాదు అంతకుమించి..!
కొన్ని వరుస పరాజయాలతో కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న రజనీకాంత్ కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ని అందించాడు నెల్సన్ దిలీప్ కుమార్
కొన్ని వరుస పరాజయాలతో కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న రజనీకాంత్ కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ని అందించాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవా ఈజ్ బ్యాక్! అంటూ అభిమానులు సంబరాలు చేసుకునేలా అతడు జైలర్ తో గొప్ప విజయాన్ని అందించాడు. అంతేకాదు.. 2.0 తర్వాత రజనీకాంత్ కెరీర్ లో మరో 500 కోట్ల క్లబ్ సినిమా సాధ్యమైంది. జైలర్ తర్వాత జైలర్ 2 కోసం సన్నాహకాల్లో ఉన్న నెల్సన్ నుంచి ఇప్పుడు మరో భారీ ప్రకటన వచ్చింది.
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఫిలమెంట్ పిక్చర్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇండస్ట్రీలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ విషయాన్ని నెల్సన్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈరోజు ప్రకటించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ కింద వచ్చే మొదటి ప్రాజెక్ట్ వివరాలను మే 3న ప్రకటించనున్నారు. ఫిలమెంట్ పిక్చర్స్‌ను స్థాపించడానికి ఒక మోటో ఉంది. నెల్సన్ వినూత్నమైన కంటెంట్ ఉన్న థీమ్‌లను అన్వేషించడం.. ఈ బ్యానర్ లో మంచి సినిమాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.
నెల్సన్ ఒక ప్రత్యేకమైన సినిమా భాషను కలిగి ఉన్న వ్యక్తి. అతడు తన సొంత బ్యానర్ కోసం సినిమాలను నిర్మించే ముందు ప్రత్యేకమైన దృష్టితో తమిళ సినిమా పరిశ్రమలో సృజనాత్మక యువకులు కూడా అదే విధంగా కొత్త పంథాలో నడవాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. మంచి క్రియేటివిటీ ఉన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు తెలిపాడు.
వినోద పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం :
నెల్సన్ దిలీప్ కుమార్ సినీరంగంలో చాల కాలంగా కొనసాగుతున్నారు. 20 ఏళ్లుగా సినీ, మీడియా రంగంలో పనిచేస్తున్న వ్యక్తి. అతడు 2018లో క్రైమ్ కామెడీ చిత్రం 'కొలమావు కోకిల'తో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించారు. డార్క్ కామెడీని నెల్సన్ ఎంతో నైపుణ్యం తో రూపొందించి మెప్పు పొందారు. శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమాతో మళ్లీ అదే తరహాలో విజయాన్ని రుచి చూశాడు. కానీ దళపతి విజయ్‌తో చేసిన బీస్ట్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంతలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'జైలర్' చిత్రం రికార్డు బద్దలు కొట్టడంతో అతడు మళ్లీ బలంగా తిరిగి వచ్చాడు.
జైలర్ విజయం తర్వాత సీక్వెల్ ప్లాన్ ఉందని నెల్సన్ ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా తన పాత్రను తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే జైలర్ సీక్వెల్ కోసం రజనీకాంత్ తిరిగి రానున్నారు. జైలర్‌లో కనిపించిన ఇతర సౌత్ సూపర్‌స్టార్లు, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. జైలర్ 2లో ఈ ముగ్గురితో పాటు మరో ప్రముఖ బాలీవుడ్ స్టార్ కూడా జాయిన్ అవుతాడనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. నెల్సన్ బీస్ట్ పరాజయం నుండి బయటకు వచ్చాడు. అతను జైలర్ విజయాన్ని ఆస్వాధించాడు. ఇప్పుడు జైలర్ 2 తో సత్తా చాటాలని మరోసారి ఉత్సాహంగా ఉన్నాడు. తమిళ సినిమాకు మాస్టర్ పీస్ అనదగ్గ చిత్రాలను అందించాలని కొత్త ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాలు తీయాలని ఎదురుచూస్తున్నాడు.