నెపోటిజానికి వ్యతిరేకంగా టాలీవుడ్‌లో ఛాన్సులు
ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో పలు అగ్ర నిర్మాణ సంస్థలు నిరభ్యంతరంగా ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
బాలీవుడ్ లో నెపోటిజం గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నా కానీ, హిందీ చిత్రసీమలో ఉన్నంతగా ఇతర పరిశ్రమల్లో వారసత్వం, బంధుప్రీతి ఇబ్బందికరంగా లేవనడానికి ఆధారాలున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో పలు అగ్ర నిర్మాణ సంస్థలు నిరభ్యంతరంగా ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. నెపోటిజానికి భిన్నంగా ఇక్కడ అగ్రనిర్మాతలు, దర్శకులు ప్రతిభకు అవకాశాలు కల్పిస్తున్నారు.
బడా నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, స్రవంతి మూవీస్ సహా పలు నిర్మాణ సంస్థలు 24 శాఖల్లో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దర్శకులు, రచయితలు, ఆర్టిస్టులకు తెలుగు చిత్రసీమలో అవకాశాల పరంగా కొదవేమీ లేదు. ఇక కొత్తగా సినీరంగంలో ప్రవేశిస్తున్న కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ట్యాలెంట్ కు అవకాశాలు కల్పించడానికి ముందుకొస్తున్నాయి.
ఇప్పుడు ఇదే బాటలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిభావంతులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా 24శాఖల్లో శిక్షణను ఇచ్చి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు (తెలుగు, కన్నడ పరిశ్రమల్లో) లో ఇందుకు సంబంధించిన శిక్షణను ఇస్తున్నట్టు సమాచారం. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైయినింగ్, వర్చ్యువల్ ప్రొడక్షన్, డిఐ, లైటింగ్ సహా పలు విభాగాల్లో పీపుల్స్ మీడియా సంస్థ సెలెక్టెడ్ అభ్యర్థులకు ఉచితంగా అవకాశాలు కల్పిస్తోందని తెలిసింది. ఔత్సాహిక ఫిలింమేకర్స్ సహా ఇతర విభాగాల్లో ఆసక్తి ఉన్న ప్రతిభావంతులు ముందుగా వారు నిర్వహించే టెస్ట్ లో పాస్ కావాల్సి ఉంటుంది. ప్రతిభను బట్టి వారికి హాస్టల్ వసతి, శిక్షణను ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. టాలీవుడ్ లో పలు అగ్ర బ్యానర్లు భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసి శిక్షణను ఇస్తున్నాయి. అందుకు భిన్నంగా ప్రతిభకు అవకాశం కల్పించేందుకు పీపుల్స్ మీడియా ముందుకు వచ్చిందని తెలుస్తోంది.