రూ.50 కోట్ల బంగ్లా గిఫ్ట్.. రూమర్స్ పై ఘాటుగా స్పందించిన నివేదా!

తన కుటుంబం 20 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటోందని, తప్పుడు ఆరోపణలు చేసే ముందు సమాచారాన్ని ధృవీకరించాలని మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Update: 2024-03-05 14:42 GMT

నివేదా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. 'బ్రోచేవారెవరురా', 'చిత్ర‌ల‌హ‌రి', 'అల వైకుంఠపురంలో', 'పాగల్', 'రెడ్', 'దాస్ కా ధమ్కీ'.. లాంటి హిట్ సినిమాలతో అలరించింది. అయితే ఇటీవల నివేదా పై తమిళ మీడియాలో నెగిటివ్ వార్తలు వచ్చాయి. ఆమెపై కొందరు డబ్బు ఖర్చుపెడుతున్నారని, దుబాయ్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతోందని రూమర్స్ ప్రచారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆమెకు 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని పుకార్లు పుట్టించారు. దీనిపై నివేదా తాజాగా ఘాటుగా స్పందించింది. తన కుటుంబం 20 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటోందని, తప్పుడు ఆరోపణలు చేసే ముందు సమాచారాన్ని ధృవీకరించాలని మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

నివేదా పేతురాజ్ తాజాగా 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ.. "ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను వీటిపై మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు ఆ సమాచారం నిజమా కాదా అని ధృవీకరించుకునే మానవత్వం కలిగి ఉంటారని నేను భావించాను. ఈ వార్తలతో నేను, నా కుటుంబం గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒకసారి ఆలోచించండి."

"నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే స్వతంత్రంగా సంపాదించడం మొదలుపెట్టాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉంటున్నాం. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు ఇప్పించమని ఏ రోజూ నేను నిర్మాతను గానీ, డైరెక్టర్ ని, హీరోని గానీ ఎప్పుడూ అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను ఎప్పుడూ వర్క్ కోసం, డబ్బు కోసం అత్యాశ పడను"

"నా గురించి ఇప్పటి వరకూ వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే అని నేను ధృవీకరించగలను. మేము 2002 నుండీ దుబాయ్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. అలాగే, 2013 నుండి రేసింగ్ అంటే నాకు ఫ్యాషన్. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మెంటల్ గా, ఎమోషనల్ గా మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను"

"జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, ఇకపై వారు ఇలా పరువుకు భంగం కలిగించరని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కాబట్టే, నేను దీనిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబాల ప్రతిష్టని నాశనం చేసేముందు, మీకు అందిన సమాచారం నిజమో కాదో ధృవీకరించుకోవాలని కోరుతున్నాను. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని నేను జర్నలిస్టులను అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజాన్ని నమ్మండి" అంటూ నివేధా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News