నటి మృతిని హత్యా కోణంలోనే దర్యాప్తు చేయాలి!
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
అనుమానాస్పద స్థితిలో నటి కం మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ నాలుగు రోజుల క్రితం ముంబైలోని అద్దె ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఇది బాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేసారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆమె విషాదకర మరణం తర్వాత ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
అస్సాంకు చెందిన కుటుంబంలో జన్మించిన మాలాబిక (31) నటిగా మారడానికి ముందు అనేక సంవత్సరాలు ఖతార్ ఎయిర్‌వేస్‌లో స్టీవార్డెస్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటిగా మారింది. అక్కడ పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంది. కానీ కెరీర్ ఆశించిన విధంగా ఎదగలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైందని కథనాలొచ్చాయి. ఇంతలోనే వర్థమాన నటి బలవన్మరణం ఆశ్చర్యపరిచింది. శనివారం ఓషివారాలోని మాలబికా దాస్ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు అందడంతో తలుపులు పగలగొట్టి, పాక్షికంగా ఛిద్రమై, కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె గురువారం (జూన్ 6) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలావుండగా చిత్ర పరిశ్రమను కుదిపేసిన ఈ దురదృష్టకర సంఘటనపై AICWA (అఖిల భారత సినీకార్మిక సంఘం)ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన బాలీవుడ్ లో ఉన్న తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెస్తోంది. ఈ రంగంలో నటీనటులు ఆత్మహత్యల వివరాలు భయంకరంగా ఉన్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పునరావృతమయ్యే ఈ విషాదాల వెనుక ఉన్న అంతర్లీన కారణాలను పరిశోధించడం ప్రభుత్వానికి అత్యావశ్యకం! అని AICWA X పోస్ట్‌లో పేర్కొంది.
మలాబికా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని, అలాగే హత్యకు అవకాశం ఉన్న కోణం సహా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఏకనాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్‌లను కూడా కోరింది. గోరేగావ్‌లోని BMC యొక్క సిద్ధార్థ్ హాస్పిటల్‌లో మాలాబికా శవపరీక్షను నిర్వహించారు. పరీక్ష వివరాలు ఇంకా తెలియలేదు.
మాలాబికా మృత దేహాన్ని ఆమె స్నేహితులు, వృత్తిపరమైన సహోద్యోగుల్లో ఒకరైన A.N. పాఠక్ స్వాధీనపరుచుకుని అంత్యక్రియలను ఒక NGO ద్వారా ఆదివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మృతురాలి వృద్ధ తల్లిదండ్రులు రాలేకపోయారు.
గత నెలలోనే తమ కుమార్తెను సందర్శించిన ఆమె తల్లిదండ్రులు ఈ ఘటన గురించి తెలుసుకుని కుంగిపోయారు. గత వారం వారు అస్సాంకు తిరిగి వెళ్లగా వారు మాలాబికా మరణ వార్త విన్నారు. కానీ అంత్యక్రియలకు హజరు కాలేకపోతున్నామని, వృద్ధాప్య సమస్యలున్నాయని వెల్లడించారు. వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
మాలాబికా ది ట్రయల్, తీఖీ చట్నీ, దేఖీ ఉండేఖి, చరమ్‌సుఖ్ మొదలైన అనేక సినిమాలు షోలు, సిరీస్‌లలో నటించింది. ఆమె ఊహించని మరణ వార్త సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా మంది దీనిని నమ్మలేదు. పలు ప్రాజెక్టులలో మాలాబికా నటనా నైపుణ్యాలను గుర్తుచేసుకుని ఆమె జ్ఞాపకార్థం నివాళులు అర్పించారు.