ఈ అస్తిత్వం..వ్యక్తిత్వం మీరే నాన్న! కల్యాణ్ రామ్-ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు వారసుడిగా హరికృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు.
నందమూరి తారక రామారావు వారసుడిగా హరికృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించు కున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకం. తెలుగు చలనచిత్ర సీమలో తొలి నట వారసుడు ఎవరూ అంటే? నందమూరి హరికృష్ణ అని చెప్పాలి. అప్పటివరకు ఏ తెలుగు హీరో కుమారుడు సినిమా రంగానికి పరిచయం కాలేదు.
ఆ ఘనత హరికృష్ణ సాధించారు. 1967లో విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో బాలకృష్ణుడుగా నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత `తల్లా పెళ్లామా`, `తాతమ్మ కల`,` రామ్‌రహీమ్` చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంలో అర్జునుడుగానూ నటించారు. ఆ తర్వాత విరామ సమయంలో నిర్మాణ రంగంపై దృష్టి పెట్టారు. నిర్మాతగా హరికృష్ణ తొలి సినిమా `డ్రైవర్ రాముడు`.
తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తర్వాత `పట్టాభిషేకం`, `అనసూయమ్మగారి అల్లుడు`, `తిరగబడ్డ తెలుగుబిడ్డ`, `పెద్దన్నయ్య` వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అటుపై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో ‘సీతారామరాజు’ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రతో పెద్ద సంచలనమే అయ్యారు.
హరికృష్ణ -నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. అటుపై అదే దర్శకుడు తెరెక్కించిన `లాహిరి లాహిరి లాహిరిలో’ మరో పవర్‌ఫుల్ పాత్రతో అలరించారు. `శివరా మరాజు`, `సీతయ్య`, `టైగర్ హరిశ్చంద్రప్రసాద్`, `స్వామి` లాంటి సినిమాలతో ఆయన కీర్తి రెట్టింపు అయింది.
హరికృష్ణ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలు నెమర వేసుకుంటున్నారు. కుమారులు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. `ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మాఈ ప్రస్తానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే` అని ట్వీట్ చేసారు.