తారక్ మరో ప్రాజెక్ట్.. ఇప్పట్లో కష్టమే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఏకంగా 300 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారంట. సోలోగా పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎన్టీఆర్ ఈ మూవీ చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సిద్ధమవుతోంది.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. దీని తర్వాత తారక్ వార్ 2 మూవీ చేయనున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఈ చిత్రంలో తారక్ నటించనున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకో దర్శకుడి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పటికే వెట్రిమారన్, అట్లీ లాంటి దర్శకులు ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ రీసెంట్ గా తారక్ కి ఒక పీరియాడికల్ యాక్షన్ కథ చెప్పాడనే మాట వినిపిస్తోంది. ఈ స్టోరీ లైన్ తారక్ కి బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
రాహల్ సాంకృత్యాన్ కి కూడా వరుసగా రెండు సూపర్ హిట్స్ ఉండటంతో తారక్ తో అతని ప్రాజెక్ట్ నిజమే అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదంట. ఇప్పటికే రాహుల్ తో తారక్ మూవీ ఉంటుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తారక్ కమిట్మెంట్ లు చూస్తే మరో రెండేళ్ల వరకు అతని డేట్స్ దొరకవు.
అలాగే వెట్రిమారన్ తో సినిమా చేయడానికి గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అట్లీ కూడా తారక్ కోసం ఆసక్తిగా చూస్తున్నాడు. దేవర చిత్రం తర్వాత అతని ఇమేజ్ కచ్చితంగా పెరుగుతుంది. తరువాత బాలీవుడ్ లోచేయనున్న వార్ 2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో తారక్ గ్లోబల్ స్టార్ బ్రాండ్ వచ్చేస్తోంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలంటే భారీ బడ్జెట్ లు సిద్ధం చేసుకోవాల్సిందే. రాహుల్ సాంకృత్యాన్ లాంటి యూత్ దర్శకులతో నిర్మాతలు రిస్క్చేయకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది.