పెయిడ్ ప్రీమియ‌ర్స్ ప్ల‌స్సా? మైన‌స్సా?

విష‌యం ఉన్న చిన్న సినిమాల‌కు పెయిడ్ ప్రీమియ‌ర్ అన్న‌ది ఓ వ‌రంగా చెప్పొచ్చు.

Update: 2024-11-23 17:30 GMT

పెయిడ్ ప్రీమియ‌ర్ అన్న‌ది ద‌మ్మున్నోడి మాట‌..బాట అనొచ్చు. ప్రొడ‌క్ట్ పై ఎంతో న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప పెయిడ్ ప్రీమియ‌ర్ సాహ‌సం చేయ‌రు. ప‌క్కాగా కొడ‌తాం? అనే న‌మ్మ‌కం మేక‌ర్స లో ఉంటేనే పెయిడ్ ప్రీమియ‌ర్ జోలికి వెళ్లాలి. లేదంటే? ఉన్న‌ది కూడా ఊడిపోతుంది అన్న‌ది అంతే వాస్త‌వం. పెయిడ్ ప్రీమియ‌ర్ కి ముంద‌స్తు పాజిటివ్ టాక్ వ‌స్తే ఓపినింగ్స్ ఎలా ఉంటాయో? సినిమా పోయింది అనే టాక్ వ‌స్తే? ప‌రిస్థితి అంతే దారుణంగా ఉంటుంది అన్న‌ది గుర్తించాలి.

విష‌యం ఉన్న చిన్న సినిమాల‌కు పెయిడ్ ప్రీమియ‌ర్ అన్న‌ది ఓ వ‌రంగా చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్. 90 శాతం మందికి ఇది క‌లిసొస్తుంది. ఒక్కరోజు ముందు సినిమా చూపించడం అంటే అనుకున్నంత ఈజీ కాదు.. ఆ సినిమా భవిష్యత్తును ముందుగానే డిసైడ్ చేసే హక్కు ఆడియన్స్ చేతిలో పెట్టడమే. అది కొన్నిసార్లు వర్కవుట్ అవ్వొచ్చు.. కొన్నిసార్లు కాక‌పోవ‌చ్చు. కానీ చిన్న సినిమాని జ‌నాల్లోకి తీసుకెళ్లాడ‌నికి ఏకైక మార్గం ఇది.

'పెళ్లి చూపులు' ఆ త‌ర్వాత 'బేబి' ,'సామజవరగమన', 'మేజ‌ర్', 'సార్', 'ఘాజీ' ,'బ‌ల‌గం', 'రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్' ఇంకా చాలా సినిమాలు పెయిడ్ ప్రీమియ‌ర్ల‌తోనే మంచి విజ‌యాలు సాధించాయి. ఇవ‌న్నీ రిలీజ్ కి ఒక‌టి రెండు రోజుల ముందే వేసిన సినిమాలు. వీటికి రిలీజ్ అనంత‌రం మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో భారీ ఎత్తున ఓపెనింగ్స్ ద‌క్కాయి. అప్ప‌టిక‌ప్పుడు థియేట‌ర్ల సంఖ్య పెరిగింది. ఈసినిమాల్లో కంటెంట్ ఉంది కాబ‌ట్టి హిట్ అయ్యాయి. కంటెంట్ లేకుండా పెయిడ్ ప్రీమియ‌ర్లు వేస్తే ఫ‌లితం శూన్య‌మే.

అలాంటి సినిమాల‌కు పెయిడ్ ప్రీమియ‌ర్ అన్న‌ది అతి పెద్ద రిస్క్. క‌నీస ఓపెనింగ్ లు కూడా రావు. ఇలాంటి సినిమాలు పెయిడ్ ప్రీమియ‌ర్ కాక‌పోయి ఉంటే? టాక్ ఎలా ఉంది? అన్న‌ది జ‌నాల‌కు తెలియ‌దు. క‌నీసం ఓ సారి ట్రైచేద్దామ‌నో? టైంపాస్ కోస‌మైనా థియేట‌ర్ కి వ‌చ్చే అవ‌కాశ ఉంటుంది. అదే పెయిడ్ ప్రీమియ‌ర్ వేసి పోయిన సినిమా అని టాక్ వ‌స్తే టికెట్ డ‌బ్బు వృద్ధా అనే ఆలోచ‌న‌ వెంటాడుతుంది. అప్పుడ‌ప్పుడు పెయిడ్ ప్రీమియ‌ర్లు స్టార్ హీరోల సినిమాల‌కు వేస్తుంటారు.

Tags:    

Similar News