పాన్ ఇండియా సినిమాలకు టైటిళ్లతోనే చిక్కులు
ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమాలకు టైటిళ్లతో చిక్కులు వచ్చి పడుతున్నాయి.
ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమాలకు టైటిళ్లతో చిక్కులు వచ్చి పడుతున్నాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న టైటిల్ ని ఎంపిక చేసుకుని అన్ని భాషల్లో అదే టైటిల్ తో రిలీజ్ చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒక వేళ లోకల్ టైటిల్ ని ఎంపిక చేసుకుంటే దానికి తగ్గట్టుగానే ఆ సినిమాపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోతోంది. మొన్నటికి మొన్న ధనుష్ రాయన్, చియాన్ విక్రమ్ నటించిన తంగళన్ చిత్రాలను టైటిల్ మార్పు లేకుండా అదే టైటిల్ తో అన్ని భాషల్లోను విడుదల చేసారు. అయితే దీనికి ఇరుగు పొరుగు భాషల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
ముఖ్యంగా తెలుగులో పొరుగు భాషా సినిమాలకు తెలుగు టైటిల్ కావాలని ప్రజలు విమర్శకులు కోరుకుంటున్నారు. తమిళ సినిమాలు కానీ ఇంకేదైనా భాష నుంచి వచ్చే సినిమాకి కానీ తెలుగు టైటిల్ ని ఎంపిక చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో వీలు కావడం లేదు. ఇటీవలే విడుదలైన వేట్టయాన్ తెలుగు వెర్షన్ కి వేటగాడు అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. కానీ అప్పటికే ఈ టైటిల్ వేరొకరి చేతిలో ఉండటంతో టైటిల్ మార్పు సాధ్యం కాలేదు.
ఇప్పుడు అలాంటి చిక్కు సమస్యే గేమ్ ఛేంజర్ కి ఎదురైందని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. తమ సినిమా గేమ్ ఛేంజర్ ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో అత్యంత భారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు ఆయన. అదే సమయంలో ఈ మూవీ టైటిల్ విషయమై ఓ చిక్కు వచ్చి పడిందని .. అప్పటికే ఓ భాషలో రిజిస్టర్ అయి ఉండటం వల్ల తాము సేమ్ టైటిల్ తో రిలీజ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. వేరే నిర్మాతకు హక్కులు ఉండటంతో ఆ టైటిల్ కోసం తాము డబ్బు చెల్లించాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాలు తీసేప్పుడు చాలా చిక్కులు ఉన్నాయి. అందరికీ నచ్చే టైటిల్ ని ఎంపిక చేయడం చాలా కష్టం అని కూడా దిల్ రాజు అన్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా, ఇందులో పలు భాషల నటీనటులు కూడా ఉన్నారు.