నిదానమే ప్రధానం సూత్రంతో వెంకీ మామ..!

వసూళ్ల విషయం పక్కన పెడితే ఏళ్లకు ఏళ్లు థియేటర్లకు దూరంగా ఉన్న వారిని ఆ సినిమాతో వెంకీ మామ థియేటర్లకు రప్పించారు.;

Update: 2025-03-29 05:03 GMT
Venkatesh’s New Movie Updates

సుదీర్ఘ కాలం తర్వాత సీనియర్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్ సాలిడ్‌ సక్సెస్‌ను అందుకున్నారు. ఇక వెంకీ మామ పనైపోయింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఆ సినిమా కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈమధ్య కాలంలో కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి సాధించలేకపోయిన రూ.100 కోట్ల షేర్‌ను సున్నాయాసంగా దక్కించుకుంది. వసూళ్ల విషయం పక్కన పెడితే ఏళ్లకు ఏళ్లు థియేటర్లకు దూరంగా ఉన్న వారిని ఆ సినిమాతో వెంకీ మామ థియేటర్లకు రప్పించారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్‌ సక్సెస్ దక్కడంతో వెంకటేష్ వెంటనే కొత్త సినిమాను షురూ చేస్తాడని, ఇదే ఏడాదిలో ఆ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ వెంకటేష్ నిదానమే ప్రధానం అనే సూత్రంతో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ సినిమా వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినా ఇప్పటి వరకు కొత్త సినిమా విషయలంలో వెంకీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ మధ్య నందు అనే దర్శకుడితో వెంకటేష్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇంకా అది చర్చల దశలోనే ఉందని, వెంకటేష్ ఇమేజ్‌కి తగ్గట్లుగా, ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా మంచి వినోదభరితమైన కథను సిద్ధం చేసే పనిలో నందు ఉన్నాడని తెలుస్తోంది.

ఈ సమ్మర్‌ మొత్తం వెంకటేష్ విరామంలోనే ఉంటాడట. కనుక ఈ ఏడాది ద్వితీయార్థంలో వెంకటేష్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అది కూడా నందు స్క్రిప్ట్‌తో మెప్పిస్తేనే వెంకటేష్ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నందుతో సినిమా తర్వాత మరోసారి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్ సినిమాను చేయాల్సి ఉంది. అది సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2027 సంక్రాంతికి వచ్చే విధంగా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌ను ప్లాన్‌ చేయనున్నారు. అంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సీక్వెల్‌ పనులను మొదలు పెట్టాలి. అంటే అప్పటి వరకు నందుతో సినిమా మొదలు అయితే షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏది ఏమైనా సక్సెస్ వచ్చింది కదా అని వెంటనే వెంకటేష్ తదుపరి సినిమా విషయంలో తొందర పడటం లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయడంతో పాటు, మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం కోసం స్క్రిప్ట్‌ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన నుంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో వెంకీ మామ రాబోయే రెండు మూడు ఏళ్ల పాటు అవే తరహా సినిమాలతో రావాలని భావిస్తున్నాడట. ప్రయోగాత్మక సినిమాలు, యాక్షన్ సినిమాలను కాస్త తగ్గించాలని కూడా వెంకీ భావిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికే విని ఓకే చేసిన యాక్షన్‌ సినిమాల కథలను పక్కకు పెట్టేశాడని టాక్‌ వినిపిస్తుంది. మరి వెంకీ మామ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు వస్తుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News