వరద బాధితులకు మద్దతుగా జెట్టి హీరో.. పవన్ అభినందన

కృష్ణ మనినేని తన మొదటి సినిమా "జెట్టి" తో మంచి పేరు సంపాదించుకున్నారు.

Update: 2024-09-13 08:15 GMT

కృష్ణ మనినేని తన మొదటి సినిమా "జెట్టి" తో మంచి పేరు సంపాదించుకున్నారు. గత 8 సంవత్సరాలుగా కృష్ణ మనినేని తన 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడలో భారీ వర్షాలు కురిసి ఎన్నో ప్రాంతాల్లో తీవ్రంగా వరదలు సంభవించాయి, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

ఈ కష్టకాలంలో కృష్ణ మనినేని ఆధ్వర్యంలో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారు వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి బాధితులకు అండగా నిలిచారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి, కృష్ణ మనినేనిని పర్సనల్‌గా ఆహ్వానించారు. కృష్ణ మనినేని, పవన్ కళ్యాణ్‌ను కలసి, వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా కృష్ణ మనినేని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు ఆనందం వ్యక్తం చేశారు. 100 డ్రీమ్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను పవన్ కళ్యాణ్ ఎంతో శ్రద్ధగా విని, ప్రశంసలు తెలిపారని చెప్పారు. ఆయన ఆశీర్వాదంతో మరింత మంచి కార్యక్రమాలను చేపట్టడానికి ఉత్సాహం పొందామని అన్నారు.

కృష్ణ మనినేని చివరిగా, “తమ బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించి మా సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్‌ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాము” అని పేర్కొన్నారు. ఇక ఈ యువ హీరో సేవా కార్యక్రమాలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించడంతో భవిష్యత్తులో చాలామందికి ప్రేరణగా ఉంటుందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనవంతు సహాయంగా రెండు రాష్ట్రాలకు రెండు కోట్ల విరాళం అందించారు. అలాగే మరో 4 కోట్లు అదనంగా పంచాయితీ రాజ్ శాఖ కోసం విరాళం ఇచ్చారు. పవన్ ముందుగా తను సహాయం చేస్తూ నలుగురికి ప్రేరణగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News