సింగపూర్ యూనివర్శిటీలో సతీసమేతంగా పవన్!
ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరయ్యారు. సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా కొణిదెలా నేడు డిగ్రీ పట్టా అందు కున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్-అన్నాలెజ్నివా ఇంతవరకూ విదేశాల్లో కనిపించింది లేదు. హైదరాబాద్, ఏపీలోనే జంటగా కనిపించేవారు. తొలిసారి భార్య కోసం పవన్ దేశం దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కు ఎలాగూ విదేశాలకు వెకేషన్లు వెళ్లే అలవాటు లేదు. సినిమా, రాజకీయం అంటూ నిత్యం బిజీగా గడుపుతారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పదవి హోదా కూడా రావడంతో బాధ్యతలు పెరిగాయి.
అలాగే సింగపూర్ నుంచి రష్యా వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరి రష్యా వెళ్తారా? లేక హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారా? అన్నది తెలియాలి. పవన్ కళ్యాణ్ -అన్నాలెజ్నివా పరిచయం గురించి తెలిసిందే. జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ` తీన్మార్` సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది.
దీంతో ఇద్దరు 2013లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు సగం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి. ముందుగా ఓజీ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.