రివ్యూలు బ్యాన్ చేయాలంటూ పిటిషన్.. తిరస్కరించిన హైకోర్ట్!
"సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలను ఖండిస్తున్నాం. సినిమాల్లోని లోపాలను విమర్శించే హక్కు జర్నలిస్టులందరికీ ఉంది.
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమా రివ్యూలపై నిషేధం విధించాలంటూ తమిళ సినీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌ఏపీఏ) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. థియేటర్లలో సినిమాలను విడుదల చేసిన తేదీ నుండి మూడు రోజుల పాటు రివ్యూలు ఇవ్వడాన్ని నియంత్రించాలని కోరుతూ తమిళ నిర్మాతల సంఘం ఇటీవల కోర్టును ఆశ్రయించగా.. మంగళవారం ఆ పిటిషన్ ను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
రివ్యూలు సినిమా రిజల్ట్ ను ప్రభావితం చేస్తున్నాయని, ముఖ్యంగా పెద్ద సినిమాలు నష్టపోతున్నాయని తమిళ నిర్మాతల మండలి భావిస్తోంది. ఈ నేపథ్యంలో రివ్యూలను బ్యాన్ చెయ్యడమే కాకుండా.. ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ కోసం మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు తమిళనాడు ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ సేవల విభాగానికి దిశానిర్దేశం చేయాలని టీఎఫ్‌ఏపీఏ పిటిషన్ లో పేర్కొంది. అయితే జస్టిస్ ఎస్.సౌంథర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రిట్ పిటిషన్‌ను తిరస్కరించింది.
థియేటర్ల పరిసరాల్లో పబ్లిక్ టాక్ తెలుసుకునే యూట్యూబ్ ఛానల్స్ ను నియంత్రించాలని తమిళ నిర్మాతల మండలి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ఒపీనియన్ పేరుతో థియేటర్ల వద్ద రివ్యూలు తీసుకోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తోందని.. 'ఇండియన్ 2', 'వేట్టయన్' 'కంగువ' లాంటి సినిమాలు దీని వల్లనే నష్టపోయాయని పేర్కొన్నారు. అందుకే ఇకపై థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానళ్లను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
"సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలను ఖండిస్తున్నాం. సినిమాల్లోని లోపాలను విమర్శించే హక్కు జర్నలిస్టులందరికీ ఉంది. అయితే ఇది కేవలం సినిమాకి మాత్రమే పరిమితం అవ్వాలి. కానీ దర్శక నిర్మాతలు, హీరోలపై వ్యక్తిగత దాడులకు పాల్పడటన్ని, వారిపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కడానికి సినిమా రివ్యూలను ఒక సాధనంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సినిమాలోని లోపాలను, తప్పులను ఎత్తిచూపే ప్రమాణాల వంటివారు ఫిలిం క్రిటిక్స్. కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో సినిమా మొత్తాన్ని విమర్శించడం, వ్యక్తిగత దాడులు చేయడం సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేయడమేనని అసోసియేషన్ భావిస్తోంది"
''సినిమా గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. విమర్శకులు తమ అభిప్రాయాలను అందరి అభిప్రాయాలుగా ప్రజలకు అందించడం మానుకోవాలి. సినిమాని మూడు గంటల వినోదంగా మాత్రమే చూడకుండా, సమాజానికి అన్యాయం చేసినట్టు మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని భావిస్తున్నాం. సినిమాలను సమీక్షించే హక్కు క్రిటిక్స్ కి ఉంటుంది. అయితే వ్యక్తిగత దురుద్దేశంతో సినిమాపై ద్వేషం వెళ్లగక్కకుండా జర్నలిస్టులందరూ సినిమా రివ్యూలు రాయవలసిందిగా కోరుతున్నాము. సినీ ఇండస్ట్రీని బతికించడానికి జర్నలిస్టులు తగినవిధంగా విమర్శలు చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ తమిళ సినీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఓ బహిరంగ లేఖ రాసింది. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో రివ్యూలను బ్యాన్ చెయ్యాలని పిటిషన్ వేస్తే, కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది.
ఇదిలా ఉంటే కోలీవుడ్ లో మాదిరిగానే టాలీవుడ్ లో కూడా థియేటర్ల దగ్గర ఆడియన్స్ ఒపీనియన్స్ తెలుసుకోడాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయని ఇటీవలి ప్రెస్ మీట్ లో దిల్ రాజు తెలిపారు. తమిళనాడులో సక్సెస్ ఫుల్ అయితే ఆటోమేటిక్ గా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఒకవేళ ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే.. ఈ డిజిటల్ యుగంలో పబ్లిక్ టాక్ ను, రివ్యూలను నియంత్రించడం ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూడాలి. అయినా బాగున్న సినిమాని రివ్యూలు కూడా ఏమీ చేయలేవని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి ఫిలిం మేకర్స్ సమీక్షలు అడ్డుకోవడం కంటే మంచి సినిమాలు తీయడం మీద దృష్టి పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.