ఇక్కడ ఆర్జీవీ 'వ్యూహం'.. అక్కడ 'పొలిటికల్ వార్'
న్యూయార్క్‌కు చెందిన ముఖేష్ మోడీ తన సినిమా 'పొలిటికల్ వార్'కి సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించగా భారతదేశ ఫిల్మ్ సర్టిఫికేషన్ బాడీ నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. రాజకీయ నాయకుల పాత్రలను, వారి యథార్థ కథలను 'వ్యూహం' పేరుతో సినిమాగా రూపొందించిన ఆర్జీవీ 2024 ఎన్నికల ముందు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ విడుదల విషయంలో ఎదురైన పరాభవం గురించి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ నాయకులపై తెరకెక్కించిన వ్యంగ్య పొలిటికల్ డ్రామా వ్యూహం రిలీజ్ కి మోక్షం రాలేదు. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ సాగుతోంది. ఇటీవల ఆర్జీవీని పోలీస్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 'వ్యూహం' సెన్సార్ (కర్నాటక సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్) ఒకసారి పూర్తయిన తర్వాత కూడా తిరిగి పునఃపరిశీలనకు వెళ్లింది. దీనిపై విచారణ ఇంకా పెండింగ్ లో ఉండగా రిలీజ్ డైలమా కొనసాగుతోంది.
ఇప్పుడు ఇదే తరహాలో మరో సినిమా తీవ్రమైన చిక్కుల్లో పడటం ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. న్యూయార్క్‌కు చెందిన ముఖేష్ మోడీ తన సినిమా 'పొలిటికల్ వార్'కి సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించగా భారతదేశ ఫిల్మ్ సర్టిఫికేషన్ బాడీ నిరాకరించింది. ఇందులో పాత్రలు, నటీనటుల ముఖాలు భారతీయ రాజకీయ నాయకులతో పోలి ఉండటమే తిరస్కరణకు కారణమని బోర్డు పేర్కొంది. వాస్తవానికి '2024 ఎలక్షన్ వార్' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి అభ్యంతరాల మేరకు పేరును మార్చారు. రివైజింగ్ కమిటీ రివిజన్‌లు సూచించినప్పటికీ సెన్సార్ బోర్డ్ వద్ద సినిమా తిరస్కరణకు గురైంది.
దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖేష్ మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. సెన్సార్ బోర్డ్‌లో సమర్థులైన వ్యక్తులను నియమించాలని, సినిమా నిర్మాతల ప్రయోజనాల కోసం వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. అంతేకాదు సెన్సార్ షిప్ విషయంలో ఎదురు దెబ్బ తగిలినా కానీ అతడు వెనక్కి తగ్గలేదు. ఫిబ్రవరి 16న విదేశాలలో అలాగే OTT ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా విడుదలను స్వయంగా ప్రకటించారు.
ఆదిపురుష్‌ని మళ్లీ ముగ్గులోకి లాగాడు!
ఫిలింమేకర్ ముఖేష్ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించేందుకు రణబీర్, ప్రభాస్ చిత్రాలను కూడా ముగ్గులోకి లాగాడు. యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వడంపైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ఆయా సినిమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ సెన్సార్ ప్రతినిధులను విమర్శించాడు. ముఖేష్ CBFC కార్యాలయం నుండి ఒక వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. యానిమల్ మితిమీరిన హింస, స్త్రీద్వేషపూరిత కథనాన్ని, ఆదిపురుష్ హిందూ మనోభావాలను దెబ్బతీసే కథనాన్ని ఆయన విమర్శించారు. ఈ చిత్రం ఓటింగ్‌ను ప్రేరేపించడం, అవినీతి రాజకీయ నాయకులను, వారి విభజన రాజకీయాలను బహిర్గతం చేయడమే ఎజెండాగా తెరకెక్కింది. భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనే థీమ్ తో తెరకెక్కింది.