ప్రభాస్.. అందరి ఫోకస్ ఆ టైటిల్ పైనే..

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న జరగనుంది. ఈసారి అభిమానులు ప్రభాస్ సినిమాల నుంచి భారీ అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు

Update: 2024-10-06 15:30 GMT

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న జరగనుంది. ఈసారి అభిమానులు ప్రభాస్ సినిమాల నుంచి భారీ అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్-ఇండియా స్టార్‌గా ప్రభాస్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతో ఈ ఏడాది పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా నిలవనుంది.

ఇటీవలే ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అక్టోబర్ 23న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను వేసవి 2025లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా నవంబర్ చివరికల్లా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇకపోతే ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఫౌజీ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదే టైటిల్ ఫిక్స్ అని చాలాకాలంగా ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇక ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌కు లైన్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు.

ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ప్రభాస్ లైన్‌ అప్‌లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన షూట్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. “స్పిరిట్” చిత్రబృందం కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక సరికొత్త అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ “కల్కి” సీక్వెల్ కూడా లైన్‌లో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మరికొంత సమయం పడే అవకాశం ఉంది. కానీ “కల్కి” చిత్రబృందం కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతారని భావిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి కర్ణుడి పాత్రలో అలరించనున్నారు.

ఇలా ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాల నుంచి భారీ అప్డేట్స్ రాబోతున్నాయి. కానీ ఈ అప్డేట్లలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఫౌజీ” సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ కోసమే అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ లైన్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడంతో, వీటిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News