ఇన్‌స్టా హ్యాకైందా డార్లింగ్?
2023లో ఇప్పటికే రెండు 1000 కోట్ల క్లబ్ లు నమోదయ్యాయి. పఠాన్- జవాన్ గ్రాండ్ సక్సెస్ పై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
2023లో ఇప్పటికే రెండు 1000 కోట్ల క్లబ్ లు నమోదయ్యాయి. పఠాన్- జవాన్ గ్రాండ్ సక్సెస్ పై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పుడు మరో 1000 కోట్ల క్లబ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోందని నమ్మకంగా చెబుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారూఖ్ డుంకీ చిత్రాలు ఈ క్లబ్ లో చేరతాయా లేదా? అన్నది అటుంచితే ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ కచ్ఛితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని నమ్ముతున్నారు. ఈ సీజన్ లో భారీ అంచనాల నడుమ రిలీజవుతున్న సినిమాగా సలార్ చర్చల్లో ఉంది.
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ `సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్` అంతకంతకు ఉత్కంఠ పెంచుతోంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న రిలీజ్‌కి రెడీ అవుతోంది. తెలుగు-తమిళం-హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో అత్యంత భారీగా విడుదల కానుంది. మేకర్స్ వచ్చే నెల నుండి ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. క్రిస్మస్ బరిలో రిలీజ్ వరకూ ప్రచారంలో మరో రేంజును చూపించే ప్లాన్ తో టీమ్ మెంబర్స్ ముందుకెళుతున్నారు.
అయితే ఊహించని విధంగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అదృశ్యమైనట్లు తెలిసింది. అకౌంట్ హ్యాక్ అయిందా లేక ప్రభాస్ స్వయంగా డీయాక్టివేట్ చేశారా అనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాల్లో అవాంచితంగా పుట్టుకొచ్చిన డమ్మీ ఖాతాలను సదరు ప్లాట్ ఫామ్ లు తొలగిస్తున్నాయి. 24 గంటలలోపే ప్లాట్‌ఫామ్ నుండి చాలా ఖాతాలు అదృశ్యమయ్యాయి. చాలా అకౌంట్లు హ్యాక్ అయ్యాయని కొందరు అంటున్నారు. అయితే దీనిపై ప్రభాస్ కానీ అతడి టీమ్ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సలార్ వర్సెస్ డుంకీ
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో సలార్- డుంకీ చిత్రాలు అత్యంత భారీగా విడుదల కానున్నాయి. దీంతో ఇరువైపులా పంపిణీ వర్గాల్లో రెండు భారీ చిత్రాల క్లాష్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ సలార్ కోసం దక్షిణాదిన భారీగా థియేటర్లు లాక్ అవ్వగా, అటు ఉత్తరాదినా ప్రముఖ పంపిణీదారులు అయిన టాండన్ లు భారీగా థియేటర్లను లాక్ చేసారని తెలిసింది. మరోవైపు కింగ్ ఖాన్ షారూఖ్ - రాజ్ కుమార్ హిరాణీ ఎన్నో ఆశలు పెట్టుకున్న డుంకీ కూడా ఇదే సీజన్ లో రిలీజవుతోంది. ఖాన్ సాధ్యమైనంత వరకూ థియేటర్ల పంపిణీ విషయంలో సామరస్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. సలార్ వర్సెస్ డుంకీ బాక్సాఫీస్ వార్ లో ఏ సినిమా విజయం సాధించనుందో చూడాలి. షారూఖ్ నటించిన జీరో ఇంతకుముందు కేజీఎఫ్ చిత్రంతో పోటీపడిన సంగతి తెలిసిందే. జీరో డిజాస్టరవ్వగా కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది.