విప్ల‌వాత్మ‌క మార్పుకు ప్ర‌భాస్ కార‌కుడు!

తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగేసాడు ప్ర‌భాస్. ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.

Update: 2023-10-23 08:08 GMT

తెలుగు సినిమా ఇంతింతై వ‌టుడింతై అన్న తీరుగా ఎదిగింది. నేడు ఆస్కార్ అందుకున్న ఘ‌న‌త మ‌న‌కు ద‌క్కింది. అయితే దీనికి ఉత్సాహం ఇచ్చింది మాత్రం ప్ర‌భాస్. బాహుబ‌లితో ఈ ఫీట్ సాధ్యం చేసాడు. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత సీన్ అంతా మారిపోయింది. తెలుగు చిత్ర‌సీమ‌లో రారాజు లాంటి యువ‌క‌థానాయ‌కుడు ఉన్నాడ‌ని ప్ర‌పంచానికి తెలిసింది అంటే అది ప్ర‌భాస్ రాజు వ‌ల్ల‌నే. అందుకే తెలుగు చిత్రసీమలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోష‌ల్ మీడియాలు హీటెక్కిపోతున్నాయి. మ‌రింతగా టాలీవుడ్ లోతుల్లోకి వెళితే..

తెలుగు చిత్రసీమలో ఒక్కో హీరోకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు ప్రాణం పోస్తే, ఏఎన్ఆర్ గారు సాంఘిక చిత్రాల్లో దిగ్గజం. తెలుగు సినిమాకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకు సాధ్య‌మైంది. కృష్ణంరాజు గారు ర‌ఫ్ గా ఉండే పాత్రలను పోషించగా, మెగాస్టార్ చిరంజీవి తన డాన్సులు ప్ర‌తిభ‌తో క‌మ‌ర్షియ‌ల్ బాక్సాఫీస్ రాజుగా మూడు దశాబ్దాలకు పైగా పరిశ్రమను శాసించారు. అయితే తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి ఎలివేట్ చేసిన స్టార్ మాత్రం ప్రభాస్ అన‌డంలో సందేహం లేదు. అంత‌కుముందు చాలామంది హీరోలు పాన్ ఇండియాలో సుప‌రిచితులే కానీ మార్కెట్ ప‌రంగా ఇంత హైప్ తేగ‌లిగిన మ‌రో హీరో లేరు. దీనికి రాజ‌మౌళి వంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడి చేరిక అద‌న‌పు బ‌లం ఇచ్చింద‌ని చెప్పాలి.

తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగేసాడు ప్ర‌భాస్. ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం వరకు వారసత్వం మాత్రమే సహాయపడుతుంది.. కానీ ఆ తర్వాత కెరీర్‌లో పురోగతి సాధించడం నట ప్ర‌తిభ‌పై ఆధారపడి ఉంటుంది. ఈశ్వర్‌లో ప్రభాస్ తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు వర్షంతో తన మొదటి ఘ‌న‌విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కానీ SS రాజమౌళి దర్శకత్వం వహించిన చత్రపతి అతని స్టార్‌డమ్‌ను కొన్ని మెట్టు పైకి తీసుకువెళ్లింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త దగ్గరయ్యాడు ప్రభాస్. రాఘవేంద్ర-అడవి రాముడు-చక్రం-పౌర్ణమి-యోగి-మున్నా-బుజ్జిగాడు-బిల్లా-ఏక్‌ నిరంజన్‌-రెబల్‌ వంటి సినిమాలు ప్రభాస్‌ ఫ్లెక్సిబిలిటీని మాసిజాన్ని ఆవిష్క‌రించాయి. మిర్చి అతని కెరీర్‌లో సూపర్ హిట్. అనంత‌ర కాలంలో బాహుబలి ఫ్రాంఛైజీ చిత్రాల అపూర్వ విజయంతో ప్రభాస్ పాన్-ఇండియా సంచలనంగా మారాడు.

తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వ్యాపారాన్ని జాతీయ స్థాయికి పెంచిన ఘనత కూడా ప్రభాస్‌కే దక్కుతుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో బ్రేక్ చేయని రికార్డులను ప్రభాస్ బద్దలు కొట్టాడు. ఓవర్సీస్ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి తెలుగు హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ కేవలం తెలుగు సినిమా వ‌ర‌కే కాకుండా ఇరుగు పొరుగున కూడా అమాంతం పెరిగింది. అంతేకాదు ప్రభాస్ ఇమేజ్ ఎంతగానో విస్తరించింది. ఇప్పుడు అత‌డు కేవ‌లం టాలీవుడ్‌కే పరిమితం కాదు. భార‌త‌దేశంలోని అన్ని భాష‌ల్లో క్రేజీ హీరో. జ‌పాన్ లోను స్థానికుల అభిమానం సంపాదించుకున్న న‌టుడు మ‌న ప్ర‌భాస్.

ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా చైనా, మలేషియా, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను సాధ్యం చేసిన తొలి సౌత్ ఇండియన్ సెలబ్రిటీ ప్రభాస్. గత 20 ఏళ్లుగా ప్రభాస్ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తుఫాన్లు, వరదలు, కోవిడ్ సమయంలో ప్రజలకు భారీగా ఆర్థిక‌ సహాయం అందించాడు.

డార్లింగ్ సినీకెరీర్ లో అతను భారతీయ సినిమాలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతాడని ఊహించడం సులభం. కానీ ఇక‌పై పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ ని కొల్ల‌గొడ‌తాడ‌న్న‌ది కూడా నిజం కాబోతోంది. స‌లార్ పార్ట్ 1: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది. అలాగే నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న `కల్కి 2898 AD` సైన్స్ ఫిక్ష‌న్ కేట‌గిరీలో మ‌రో సంచ‌ల‌నం కాబోతోంది. ప్రభాస్-మారుతి సినిమా .. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఇప్ప‌టికే ఎంతో ఆస‌క్తిని పెంచాయి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇక‌పై పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా మారుతాడ‌న‌డంలో సందేహం లేదు. అత‌డికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Tags:    

Similar News