క్లైమాక్స్ లో ఐడియా ప్రభాస్ ఇచ్చిందేనా?

కల్కి 2898ఏడీ మూవీ చూస్తున్నంత సేపు అశ్వద్ధామగా చేసిన అమితాబ్ బచ్చన్ హీరోగా అనిపిస్తుంది

Update: 2024-06-29 12:23 GMT

కల్కి 2898ఏడీ మూవీ చూస్తున్నంత సేపు అశ్వద్ధామగా చేసిన అమితాబ్ బచ్చన్ హీరోగా అనిపిస్తుంది. ఆయన పాత్ర చుట్టూనే మూవీ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కల్కికి జన్మనివ్వబోయే సుమతిని కాపాడటానికి అశ్వద్ధామ రావడం. ఆమెకి రక్షణగా ఉండటం జరుగుతుంది. అశ్వద్ధామ బలం, శక్తి ముందు ఎవరూ కూడా నిలబడలేరు. అయితే భైరవ పాత్రలో ప్రభాస్ అశ్వద్ధామతో తలపడతాడు. ఓ విధంగా ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో నడుస్తుంది.

కాంప్లెక్స్ లోకి వెళ్లడం కోసం సుమతిని విలన్ మనుషులకి అప్పగించడానికి అశ్వద్ధామతో ఫైట్ చేస్తాడు. అయితే ఓడిపోతూ ఉంటాడు. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అశ్వద్ధామ భైరవ ప్రాణాలు తీసేంత వరకు వెళ్తాడు. అయితే విలన్ గ్యాంగ్ అశ్వద్ధామని బంధించి సుమతిని తీసుకుపోయే సమయంలో భైరవ క్యారెక్టర్ ఒక్కసారిగా కర్ణుడిగా ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. కర్ణుడిగా మారిన భైరవ విలన్ గ్యాంగ్ చంపేసి సుమతిని కాపాడుతాడు. ఈ సీక్వెన్స్ కి ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడ్డాయి.

భైరవ కాస్తా కర్ణుడిగా మారే ఎలిమెంట్ మొత్తం గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుంది. అంతగా పబ్లిక్ కర్ణుడి పాత్రకి కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. నిజానికి నాగ్ అశ్విన్ భైరవని మామూలు సూపర్ హీరోగానే చూపించాలని అనుకున్నారంట. అయితే భైరవకి మైథాలజీ హీరో క్యారెక్టర్ ని ఎడాప్ట్ చేస్తే బాగుంటుందని ప్రభాస్ సలహా ఇచ్చాడంట. అక్కడి నుంచి కర్ణుడి ఐడియా నాగ్ అశ్విన్ కి వచ్చి దానిని చివర్లో చూపించారంట. నిజానికి భాగవతంలో గాని కల్కి పురాణంలో గాని కర్ణుడి ప్రస్తావన ఉండదు.

నాగ్ అశ్విన్ కాస్తా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈ క్యారెక్టర్ ని కల్కి స్టోరీకి లింక్ చేశాడు. అయితే ఇది సాధారణ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే హిందూ పురాణాలు, ఇతిహాసాలు విశ్వసించేవారు మాత్రం ఈ సినిమాటిక్ లిబర్టీని వ్యతిరేకిస్తున్నారు. కల్కి పురాణంతో సంబంధం లేని కర్ణుడిని రిప్రజెంట్ చేయడం భారతీయ ఇతిహాసాలని వక్రీకరించడమే అవుతుందని అంటున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ ఎలిమెంట్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు.

కర్ణుడి క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో తీసుకురావడం వలన కల్కి పార్ట్ 2 స్టోరీకి మరింత ఎక్కువ స్పాన్ దొరుకుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మహాభారతంలో అధర్మం పక్షాన నిలబడిన అశ్వద్ధామ, కర్ణుడు కలియుగంలో ధర్మం వైపు నిలబడి ఎలాంటి పోరాటం చేసి కల్కి పుట్టుకకి కారణం అయ్యారు అనేది చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News