మమ్ముట్టి వారసుడిలా మోహన్ లాల్ వారసుడు ఫేమస్ కాలేదేమి?
సొంత పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ డమ్‌ని ఆస్వాధిస్తున్నారో, అంతకుమించి ఇరుగు పొరుగు భాషల్లోను గొప్ప పేరున్న నటులు.
వెటరన్ మలయాళ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి పరిచయం అవసరం లేదు. సొంత పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ డమ్‌ని ఆస్వాధిస్తున్నారో, అంతకుమించి ఇరుగు పొరుగు భాషల్లోను గొప్ప పేరున్న నటులు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లోను ఆ ఇద్దరూ నటించారు. అయితే వారి నటజీవితం (టెర్మ్) ముగిస్తే, వారసుల సన్నివేశమేమిటీ? తండ్రుల స్థాయిలో పెద్ద తెర నటులుగా ప్రభావం చూపించగలరా? అంటే... దానికి సమాధానం ఇక్కడ ఉంది.
మోహన్ లాల్ వారసుడి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ, మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కి దక్షిణాది అంతటా భారీ ఫాలోయింగ్ ఉంది. లాల్ వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పుడిప్పుడే రంగుల ప్రపంచంలో అడుగులు వేస్తున్నాడు. కానీ దుల్కర్ అలా కాదు. అతడు వేగంగా సౌత్ లో అన్ని భాషలకు సుపరిచితమయ్యాడు. ముఖ్యంగా దుల్కర్ తెలుగు లోగిళ్లకు కనెక్టయిపోయాడు. దానికి కారణం అతడిలోని చురుకుదనం, తెలివైన ప్రణాళికలు.. వ్యూహరచన. ఓకే బంగారం, మహానటి, సీతారామం వంటి చిత్రాలతో దుల్కర్ ఇప్పటికే తెలుగు ఆడియెన్ కి బాగా కనెక్టయ్యాడు. మలయాళంలో హీరోగా నటిస్తూనే, తెలుగు పరిశ్రమను మెయిన్ స్ట్రీమ్ జర్నీగా చేసుకుని వేగంగా ఎదిగాడు.
కానీ మోహన్ లాల్ వారసుడు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. దుల్కర్ తో పోలిస్తే అతడు అంత స్పీడ్ కాదు. అలాగే దుల్కర్ కంటే అతడు చిన్న పిల్లవాడు. మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా కానీ, అతడు ఇరుగు పొరుగు భాషలకు అంతగా సుపరిచితుడు కాదు. అలాగే సోషల్ మీడియాల్లోను అతడు ఏమంత యాక్టివ్ గా ఉండడు. అతడి ఇన్ స్టా పేజ్ చూస్తే, అక్కడ అసలు సినిమా వాసన అనేదే కనిపించదు. ప్రణవ్ కి అత్యంత ఇష్టమైన వ్యాపకాల్లో ట్రెక్కింగ్ .. ఎత్తైన పర్వతాలను ఆరోహించడం.. అలాగే ప్రకృతిని ఆస్వాధించడం.. ఆర్ట్ కలెక్షన్ వగైరా అద్భుతమైన ఆసక్తులు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సూపర్‌స్టార్ వారసుడు అయినా కానీ ఎంతో సింప్లిసిటీ అతడి వద్ద కనిపిస్తుంది.
దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం `లక్కీ బాస్కర్` 31 అక్టోబర్ 2024న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ.. దుల్కర్ రకరకాల ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. గలాట్టా ప్లస్‌తో ఇటీవల జరిగిన చాటింగ్ సెషన్‌లో ప్రణవ్ మోహన్‌లాల్‌తో అతడి సంబంధం గురించి, ముఖ్యంగా సినిమాలపై ఇరువురి నడుమా డిస్కషన్స్ గురించి అడిగారు. దుల్కర్, ప్రణవ్ కలిసి పెరిగారు. కానీ కాలేజ్ లు వేరు కావడంతో ఎవరి దారిలో వారు వెళ్లారు.
దుల్కర్ మాట్లాడుతూ..``ప్రణవ్‌తో నాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అవి చిన్నప్పటి నుండి మాతో వచ్చినవే. అతడు నాకంటే చిన్నవాడు.. నేను ఎప్పుడూ చిన్న పిల్లలతో గడపడం ఆనందించాను. తిరిగి పాఠశాలలో నేను 9 లేదా 10వ తరగతిలో ఉన్నప్పుడు.. నేను అతడితో అదే వయస్సులో ఉన్న అతడి బంధువులతో ఆడుకునేవాడిని. కానీ మేము పెద్దయ్యాక కాలేజీకి వెళ్లే కొద్దీ విడిపోయాము. కాబట్టి మేం నిజంగా సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకోలేకపోయాం.. అని అన్నారు.
ప్రణవ్ తల్లి సుచిత్రతో తనకు గొప్ప అనుబంధం ఉందని దుల్కర్ పేర్కొన్నాడు. ప్రణవ్ సినిమాలు విడుదలైనప్పుడల్లా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంలో సహాయం చేయమని అమ్మ సుచిత్ర తరచుగా అడిగేవారని .. ప్రణవ్ ఆ ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉండడని దుల్కర్ తెలిపారు.