టాలీవుడ్ కి మరో తెలుగమ్మాయి ప్రణవి!
తాజాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటిస్తోన్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమాతో మరో తెలుగమ్మాయి ప్రణవి మానుకోండ హీరోయిన్ గా పరిచయమవుతోంది
యూ ట్యూబర్ వైష్ణవి 'బేబి' సక్సెస్ తో మరోసారి తెలుగమ్మాయిల అంశం నెట్టింట చర్చకొస్తుంది. సినిమా సక్సెస్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ కి రావాలి..మేమున్నాం ..సహకరిస్తాం అంటూ భరోసా కల్పిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఓ స్టార్ హీరో తెలుగు అమ్మాయిల్ని ఉద్దేశించి మాట్లాడటం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలున్నారు. కానీ వాళ్లెవ్వరు తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తూ ఇలా మాట్లాడింది ఎక్కడా లేదు.
తెలుగు నటుల్ని ఎంకరేజ్ చేసింది కూడా లేదు. అలాంటి తరుణంలో బన్నీ వ్యాఖ్యలు తెలుగు అమ్మాయిల్లో కొండంత అండగా నిలిచాయి. పరిశ్రమకి రావాలి అన్న ఓ ఉత్సాహాన్ని కల్పించాయి. మరి మన దర్శక-నిర్మాతలు-హీరోలు తెలుగు అమ్మాయిలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారో వేచి చూడాలి.
తాజాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటిస్తోన్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమాతో మరో తెలుగమ్మాయి ప్రణవి మానుకోండ హీరోయిన్ గా పరిచయమవుతోంది.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా తన డెబ్యూని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ' తెలుగమ్మాయిని కావడమే నాకున్న బలం. తెలుగుదనం ఉట్టిపడేలా తెరపై కనిపించాలన్నా.. ఆ పాత్రలకు తగ్గట్టు నటనలో సహజత్వం కనిపించాలన్నా అది మనకు మాత్రమే సాధ్యం. చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టం. అనుష్క నటించిన 'అరుంధతి' లో డైలాగులు అద్దం ముందు నుంచుని ప్రాక్టీస్ చేసే దాన్ని. నటన అంటే అమ్మకి కూడా చాలా ఇష్టం. వాళ్ల ప్రోత్సాహం వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను.
చిన్న నాటి నుంచి ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. 'రోటీన్ లవ్ స్టోరీ'..'ఉయ్యాల జంపాల' తో గుర్తింపు వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి ఆఫర్లు వచ్చాయి. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. అందుకే ఇటు వైపు వచ్చాను. కళ్యాణ్ రామ్ గారి 'అమిగోస్'లోనూ నటించాను. నేను చేసిన రీల్స్ ద్వారా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలో సినిమాలో మౌనిక అనే యువతి పాత్రలో నటించా. తన పెళ్లి ఎలా జరిగింది. తన భర్త కథేమిటి? అన్నది తెరపైనే చూడాలంటోంది. ఎంతగా నవ్విస్తుందో? అదే స్థాయిలో భావోద్వేగాల్ని పంచే కథ ఇది' అని అంది.