హిందీ సూపర్‌స్టార్‌తో ప్రశాంత్ వర్మ భేటీ
హనుమాన్ ఇప్పటికే 250 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో వచ్చిన ఏ ఇతర స్టార్ హీరో సాధించలేకపోయిన అపూర్వ విజయమిది
ప్రతిభకు ఎదురే ఉండదు! అందుకు చక్కని ఉదాహరణ ప్రశాంత్ వర్మ. అ!, కల్కి, జాంబిరెడ్డి అంటూ వైవిధ్యమైన సినిమాలతో రొటీన్ కి భిన్నంగా ఆలోచించిన అతడు ఇప్పుడు దర్శకుడిగా కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. హనుమాన్ ఘనవిజయం నేపథ్యంలో అతడి స్టార్ డమ్ జాతీయ స్థాయిలో మర్మోగుతోంది. ప్రశాంత్ వర్మ ఇప్పుడు భారతదేశంలో ప్రామిస్సింగ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగేస్తున్నాడు.
హనుమాన్ ఇప్పటికే 250 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో వచ్చిన ఏ ఇతర స్టార్ హీరో సాధించలేకపోయిన అపూర్వ విజయమిది. ఇంతలోనే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన రోజున ప్రశాంత్ తన తదుపరి చిత్రంగా మనుమాన్ సీక్వెల్ `జై హనుమాన్` ని ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా హనుమాన్ ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేసింది. అదే క్రమంలో ఈ సీక్వెల్ లో దగ్గు బాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారమైంది.
ఇంతలోనే ఓ ఇంటర్వ్యూలో తాను ప్రముఖ బాలీవుడ్ హీరోతో మంతనాలు సాగిస్తున్నానని ప్రశాంత్ వర్మ అన్నారు. హనుమాన్ లో అన్ని భాషల ప్రముఖ స్టార్లు నటిస్తారని తెలిపారు. దీంతో ఫిలింసర్కిల్స్ లో చాలా ఊహాగానాలు సాగాయి. జై హనుమాన్ లో తేజ సజ్జాతో పాటు నటించే ఇతర స్టార్లు ఎవరు? ముఖ్యంగా ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు? అంటూ అంతా ఆరాలు తీస్తున్నారు. ఇప్పటికే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను కలవనున్నాడని కథనాలొస్తున్నాయి. వచ్చే వారం ప్రశాంత్‌తో రణ్‌వీర్ మీటింగ్ ఫిక్స్ చేసుకున్నట్లు ముంబై సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఇది హనుమాన్ సీక్వెల్ కోసమా లేక మరేదైనా తాజా ప్రాజెక్ట్ కోసమా అనేది ఇంకా తెలియరాలేదు. ఒకవేళ జై హనుమాన్ లో కీలక పాత్ర కోసమే రణవీర్ ని ప్రశాంత్ కలిస్తే నిజంగా అది ఒక సంచలనం కానుంది.
ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించి, ఇంత పెద్ద హిట్ చేసిన విధానం సాంకేతికతను అతడు ఉపయోగించుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భావి భారత దర్శకుల్లో సూపర్ హీరో సినిమాలతో సంచలనాలు సృష్టించగల ప్రతిభావంతుడిగా అతడిని కొనియాడుతున్నారు. ఈ భేటీ పాజిటివ్‌గా మారితే రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశాంత్ సినిమా చేయడం అనేది వినేందుకే మతిపోతుంది. కచ్ఛితంగా తెలుగు దర్శకుడు ప్రశాంత్ మరోసారి సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారతాడనడంలో సందేహం లేదు.