పృధ్వీ షాపై నటి లైంగిక ఆరోపణలు
క్రికెటర్ పృధ్వీషా- నటి సప్నాగిల్ వివాదం గతేడాది ఎంత సంచలనమైందో తెలిసిందే. గొడవ నుంచి కేసు వరకూ ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.
క్రికెటర్ పృధ్వీషా- నటి సప్నాగిల్ వివాదం గతేడాది ఎంత సంచలనమైందో తెలిసిందే. గొడవ నుంచి కేసు వరకూ ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్..కోర్టు అంటూ చాలా పెద్ద హంగామానే నడిచింది. ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తుంది. తాజాగా ఈకేసులో షాపై లైంగిక ఆరోపణలకు సంబంధించి విచారణ చేపట్టాలని ముంబై కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఆకేసుకు సంబంధించి జూన్ 19 లోపు నివేదిక అందజేయాలని తెలిపింది. దీంతో షా ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ముంబైలోని ఓ హోటల్‌లో క్రికెటర్ పృథ్వీ షా తో సెల్ఫీ విషయంలో నటి సప్నా- ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం ఎంతగా పెరిగిందంటే నటి సప్న- ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్ హోటల్ బయట బేస్ బాల్ తో పృథ్వీ షాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పృథ్వీ షా కారును కూడా వెంబడించి కారును అడ్డుకుని కారు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత పృథ్వీ- సప్నలపై పోలీసు కేసు నమోదైంది.
మూడు రోజుల కస్టడీ అనంతరం సప్న బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ వెంటనే షాపై అంధేరీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని చూసింది. పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయకపోవడంతో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా కోర్టులో ఆమె చెప్పాల్సింది అంతా చెప్పింది. `పృథ్వీ షాను నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు. అతను క్రికెటర్ అని కూడా తెలియదు.
మేము ఇద్దరమే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు ఎనిమిది మంది స్నేహితులు ఉన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా తాగి ఉన్నారు` అని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది. కోర్టులో సప్నా గిల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పృథ్వీ షాకు మద్యం అలవాటు ఉందని.. అందుకే బీసీసీఐ అతనిపై నిషేధం విధించిందని మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు ముందు ఉంచారు. అదేవిధంగా పృథ్వీ నుంచి సప్నా గిల్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలను న్యాయవాది ఖండించారు. రూ.50 వేలు ఇవ్వాలంటూ తన క్లయింట్ సప్నాగిల్ బెదిరించినట్లు పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వీటిపై షా కూడా కౌంటర్ దాఖలు చేసి పోరాటం చేస్తున్నాడు. తాజాగా లైంగిక ఆరోపణలు కూడా చేయడంతో కేసు మరింత జఠిలంగా మారింది.