ఒక్క ఫేక్ వీడియోతో టాప్ హీరోయిన్ కెరీర్ నాశనం!
భారతదేశంలోని అతిపెద్ద సూపర్‌స్టార్ ల సరసన డెబ్యూ నటిగా అవకాశాలు అందుకుంది.
భారతదేశంలోని అతిపెద్ద సూపర్‌స్టార్ ల సరసన డెబ్యూ నటిగా అవకాశాలు అందుకుంది. కథానాయికగా కెరీర్ మొదటి ఐదేళ్లలో బాక్సాఫీస్ రారాజులు నాగార్జున, అజిత్ లాంటి స్టార్ల సరసన నటించింది. ప్రతి వర్ధమాన నటికీ ఇది కుదరనిది. అయితే బాలీవుడ్ యువకథానాయిక ప్రియా గిల్‌కి ఇదంతా సాధ్యమైంది. బాలీవుడ్ టాలీవుడ్ లో ఈ భామ కెరీర్ ఘనంగా మొదలైంది. కొన్ని కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామాలలో నటించి విజయాల్ని అందుకుంది. కానీ శిఖరం ఎత్తుకు ఎదిగేస్తుంది అనుకుంటుండగానే, పైనుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కిందికి పడిపోయింది అనే కంటే కిందికి లాగేసారు! అంటే అతిశయోక్తి కాదు. అయితే సదరు కథానాయికను కాళ్లు పట్టుకు లాగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
అందాల కథానాయిక ప్రియా గిల్ 1996లో విడుదలైన `తేరే మేరే సప్నే`తో నటనలోకి ప్రవేశించింది, ఇందులో అర్షద్ వార్సీ, చంద్రచూర్ సింగ్ కూడా నటించారు. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థ ABCL నిర్మించింది. ప్రియా ఉత్తమ అరంగేట్ర నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను సంపాదించింది. ప్రియా 1999 స్లీపర్ హిట్ `సిర్ఫ్ తుమ్`లో నటించింది. ఇందులో సంజయ్ కపూర్ కూడా నటించారు. 2000 సంవత్సరం నటిగా తనకు ఉత్తమ సంవత్సరం. కింగ్ ఖాన్ షారూఖ్ సరసన `జోష్`లో నటించింది.
`రాయలసీమ రామన్న చౌదరి` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తరువాతి కొన్ని సంవత్సరాలలో ఆమె అజిత్ కుమార్ (రెడ్).. నాగార్జున (LOC కార్గిల్) వంటి అగ్ర నటుల సరసన పనిచేసింది. కానీ ఇంతలోనే కెరీర్ ఒక్కసారిగా పతనం అంచుకు చేరుకుంది. ఒకే ఒక్క రూమర్ ప్రియ కెరీర్‌ని సర్వ నాశనం చేసింది. 2000ల ప్రారంభంలో ప్రియా కెరీర్‌కు మంచి జరిగింది. కానీ ఇంతలోనే ఒక పుకారుకు తెరలేపి తనపై బురదజల్లారు. ఈ నకిలీ వార్త దావానలంలా మారింది. ప్రియా తిండికి లేక ఇల్లు లేక పూర్తిగా నిరాశ్రయురాలైందని, ఆకలితో నకనకలాడుతున్నట్లు కనిపించే ఒక వీడియో అంతర్జాలంలో వైరల్ అయింది. ఆమె ఆహారం కోసం గురుద్వారా (శిక్కు దేవాలయం) వద్ద భిక్షాటన చేసిందని ఈ వీడియోలో చూపించారు. కానీ ఆ వీడియో ఫేక్ అని తేలింది. దానిని వెబ్ నుంచి తొలగించారు. కానీ ఈ ఒక్క వీడియో తన కెరీర్ ని నాశనం చేసింది. పరిశ్రమలో ప్రియా ఇమేజ్‌ని దెబ్బ తీసింది.
ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉన్న ప్రియా తెరకు దూరమైంది. అప్పటికే ఎంపిక చేసిన చిత్రాలలో భాగమైన ప్రియ ఆ తర్వాత కొంత విరామం తీసుకుంది. ఆ తర్వాత ఆమె భోజ్‌పురిలో ఒకటి.. హిందీలో ఒక సినిమా మాత్రమే చేసింది. 2006లో విడుదలైన `భైరవి` తనకు చివరి చిత్రం.
ప్రియా గిల్ ఇప్పుడు ఎక్కడ ఉంది?
పాపులర్ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ప్రియా 2000ల చివరలో సనీరంగాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త సినీ పరిశ్రమకు చెందిన వారు కాదు. ఈ జంట దశాబ్దం క్రితం భారతదేశం నుండి వెళ్లిపోయారు. షోబిజ్ గ్లామర్‌కు దూరంగా డెన్మార్క్‌లో ప్రియా గిల్ తన కుటుంబంతో వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుందని ఒక కథనం వెల్లడించింది.
నిజానికి ఇప్పటి మీడియాతో పోలిస్తే ఒకప్పుడు మీడియా కథనాలు కథానాయికల పాలిట తీవ్ర ఇబ్బందికరంగా ఉండేవి. నాటితో పోలిస్తే ఇప్పుడు కథానాయికల ఇమేజ్ గౌరవం పెరిగాయి. దానికి తగ్గట్టే మీడియాలో ప్రోద్భలం పెరిగింది. ఏవైనా కథనాలు వేసే ముందు ఆలోచించి రాసే నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు ఇప్పుడు ఉన్నారు. ఇది నేటితరం నటీమణులకు అన్నివిధాలా శ్రేయస్కరంగా మారింది.