మెగా హీరోలు.. బ్యాక్ టూ బ్యాక్ 7 డిజాస్టర్లు..!

దీంతో కోటాను కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు, కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

Update: 2025-01-21 23:30 GMT

సినిమాల పరంగా మెగా ఫ్యామిలీకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పంజా వైష్ణవ్ తేజ్ వరకూ ఎవరూ స్థిరంగా విజయాలు అందుకోవడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేక డిజాస్టర్లుగా మారుతున్నాయి. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, ఆ తర్వాతి రోజు నుంచి నిలబడలేకపోతున్నాయి. థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోతున్నాయి. దీంతో కోటాను కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు, కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

మెగా హీరోలకు సరైన హిట్టు పడి చాలా కాలమైంది. గడిచిన రెండేళ్లలో బ్యాక్ టూ బ్యాక్ 7 డిజాస్టర్లు అందుకున్నారు. వారికి చివరిగా దొరికిన బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష' మాత్రమే. 2023 ఏప్రిల్ లో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్ లో చేరింది. అంతకముందు చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో సక్సెస్ సాధించి ఉండటంతో, మెగా ఫ్యామిలీ ట్రాక్ లో పడ్డట్లే అని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 'బ్రో' మూవీతో మొదలైన పరాజయాల పరంపర ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' వరకూ కొనసాగుతూ వచ్చింది.

'విరూపాక్ష' తర్వాత మెగా హీరోల సినిమాలను పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 69 శాతం మాత్రమే రికవరీ చేయగలిగింది. దీంతో మేనమామ-మేనల్లుళ్లకు మెమరబుల్ గా నిలిచిపోతుందనుకున్న సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ వెంటనే 'భోళా శంకర్' చిత్రంతో చిరంజీవి తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ రుచి చూసారు. ఇది బాక్సాఫీస్ దగ్గర 33% రికవరీ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటికే సోలోగా 'గని'తో ఘోరంగా దెబ్బ తిన్న వరుణ్ తేజ్.. 'గాండీవధారి అర్జున' మూవీతో దారుణమైన పరాజయాన్ని అందుకున్నారు. తొలి రోజే చేతులెత్తిసిన ఈ చిత్రం.. 8 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.

'ఉప్పెన' తర్వాత మరో హిట్టు కొట్టడానికి కష్టపడుతున్న వైష్ణవ్ తేజ్.. 'ఆదికేశవ' లాంటి మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ వరుణ్ తేజ్ కు మరో డిజాస్టర్ ను అందించింది. ఆ తర్వాత 'మట్కా' రూపంలో ఇంకో భారీ డిజాస్టర్ పలకరించింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం జీరో షేర్ రాబట్టింది. దీంతో మెగా ప్రిన్స్ అకౌంట్ లో హ్యటిక్ ప్లాప్స్ పడినట్లయింది. ఇప్పుడు లేటెస్టుగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో నిరాశ పరిచారు. ఎన్నో అంచనాలతో సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఫెస్టివల్ హాలిడేస్ పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర వేయించుకుంది.

'గేమ్ ఛేంజర్' సినిమాని తన బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అయితే ఇది 50 శాతం కంటే తక్కువ రికవరీ చేసింది. నిజానికి చరణ్ సోలోగా సక్సెస్ సాధించి చాలా కాలమే అయింది. 'రంగస్థలం' తరువాత వచ్చిన 'వినయ విధేయ రామ' ఫెయిల్యూర్ గా మారితే.. RRR తర్వాత తన తండ్రితో కలిసి 'ఆచార్య' లాంటి డిజాస్టర్ చవి చూసారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అనే కొత్త ట్యాగ్ తో వచ్చి 'గేమ్ ఛేంజర్' వంటి పరాజయాన్ని మూటగట్టుగున్నారు. ఇలా మెగా హీరోలకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీంతో రాబోయే 'విశ్వంభర' 'హరి హర వీరమల్లు' 'ఓజీ' 'SYG - సంబరాల ఏటిగట్టు' సినిమాలపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి విజయాలు అందుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News