పూరీ చెప్పిన ముగ్గురు మాంక్స్ కథ!
తాజాగా 'లాఫింగ్ మ్యాంక్స్' పేరుతో పాడ్ కాస్ట్‌ను పూరీ యూట్యూబ్ లో షేర్ చేశారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గత కొన్నేళ్లుగా ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన 'లైగర్', 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో దర్శకుడు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అయితే అప్పుడప్పుడు 'పూరి మ్యూజింగ్స్' పేరుతో అభిమానులను పలకరిస్తూ వస్తున్నారు. తాజాగా 'లాఫింగ్ మ్యాంక్స్' పేరుతో పాడ్ కాస్ట్‌ను పూరీ యూట్యూబ్ లో షేర్ చేశారు.
''నేను చదివిన కథ ఇది. పురాతన చైనాలో ముగ్గురు మాంక్స్ ఉండేవాళ్లు. వాళ్ల పేర్లు ఏంటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ముగ్గురూ బొద్దుగా ముద్దుగా లావుగా ఉండేవాళ్ళు. ముగ్గురు కలిసి ట్రావెల్ చేసేవాళ్ళు. ఊరూరా తిరిగేవాళ్లు కానీ, ఎవరికీ ఏమీ చెప్పేవారు కాదు. ఒకరోజు ఒక ఊరిలో నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ముగ్గురూ నవ్వడం మొదలు పెట్టారు. అక్కడ ఉంటున్న వారికి వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. కానీ, వీళ్ల నవ్వు చూసి వాళ్లు కూడా నవ్వడం మొదలు పెట్టారు. కాసేపటికి, అక్కడ పెద్ద లాఫింగ్ క్రౌడ్ తయారైంది''
''ఎవరు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. ఆ నవ్వు మెల్లగా ఆ విలేజ్ అంతా స్ప్రెడ్ అయింది. ప్రతీ ఇంటికి చేరింది. అప్పుడు వాళ్లు ముగ్గురు మరో ఊరు వెళ్లారు. లాఫింగే వాళ్ల ప్రేయర్. వాళ్లు ఎలాంటి పాఠాలు చెప్పేవాళ్లు కాదు.. నోరు విప్పి మాట్లాడేవాళ్లు కాదు. అన్ని పాఠాలను కలిపి వాళ్లు తయారు చేసిన ప్రేయర్ నవ్వటం. చైనాలో వాళ్లు ఎక్కడకి వెళ్లినా అందరూ వారిని ప్రేమించటం మొదలు పెట్టారు. బతికినన్నాళ్లు జీవితంలో నవ్వగలిగితే చాలు అన్నదే వాళ్ల ఉద్దేశం. ఇలా ఎన్నో ఏళ్ళు చైనా అంతా తిరిగి తిరిగి అందర్నీ నవ్విస్తూ బతికారు''
''కానీ ఒకరోజు వారిలో ఒక మాంక్ చనిపోయాడు. ఈ విషయం తెలిసి ఊళ్ళో అందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ముగ్గురిలో ఒకడు చనిపోవడం వాళ్ళందరికీ బాధ కలిగించింది. ఇప్పుడు ఇద్దరే మిగిలారు. చనిపోయిన మాంక్ ని చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ కాసేపటికి మిగిలిన ఇద్దరు మాంక్స్ పెద్దగా నవ్వటం మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ళు నవ్వీ నవ్వీ నవ్వుతూనే ఉన్నారు. ప్రాణ స్నేహితుడు చనిపోతే ఏడవడం మానేసి ఎందుకు అలా నవ్వుతున్నారు? అని ఒకాయన అడిగాడు"
"అప్పుడు ఒక మాంక్ మొదటిసారి నోరు విప్పి చెప్పాడు. 'నిన్న మీ ఊరికి వస్తూ మాలో ఎవరు ముందు చనిపోతారన్న ఆలోచన మాకు వచ్చింది. నేనంటే నేనని ముగ్గురం పందెం వేసుకున్నాం. ఇవాళ వీడు చనిపోయాడు. నా స్నేహితుడు పందెం గెలిచాడు. అందుకే ఆనందంలో మేమిద్దరం నవ్వుతున్నాం' అని చెప్పాడు. లైఫ్ మీద వాళ్ళ అవగాహన చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చైనా సంప్రదాయం ప్రకారం, అతను ఇన్నాళ్లు వేసుకుని తిరుగుతున్న బట్టలో అతన్ని చుట్టి దహనం చేయడం మొదలుపెట్టారు"
"కానీ ఆ మాంక్ తన బట్టల్లో క్రాకర్స్, ఫైర్ వర్క్స్ దాచుకున్నాడట. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అతని శవం కాలుతున్నప్పుడు పటాకులు పేలుతూ, జువ్వలు గాల్లోకి ఎగురుతుంటే ఊళ్ళో వాళ్లందరూ కంగారు పడ్డారు. ఇలాంటివి బట్టల్లో పెట్టుకుని ఎవడైనా తిరుగుతాడా? అని ఒకాయన నవ్వుతుంటే, అక్కడున్న వాళ్ళంతా పగలబడి నవ్వారట. అలా మాంక్ చావుని ఊర్లో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మనం ఇక్కడ పుట్టింది కేవలం నవ్వుకోవడం కోసమే అని తెలుసుకుంటే, జీవితం ప్రశాంతంగా గడిచిపోద్ది. మనందరం భూమిపైకి విజిటింగ్ కోసం వచ్చాం. టూర్‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా, అద్దంలో చూసి హాయిగా నవ్వుకోవటమే'' అని పూరి జగన్నాథ్ చెప్పారు.
పూరీ మ్యూజింగ్స్ లో భాగంగా చెప్పిన 'లాఫింగ్ మ్యాంక్స్' పాడ్ కాస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవిత సత్యాన్ని, హార్ట్ టచింగ్ ఫిలాసఫీని పూరీ తనదైన శైలిలో ఒక సింపుల్ కథతో చాలా అద్భుతంగా చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్నీ తెలిసిన వ్యక్తి గొప్ప తత్వవేత్త అవుతాడు.. పూరీ ఆధునిక ఋషి అని వ్యాఖ్యానిస్తున్నారు. దర్శకుడు మంచి సినిమాతో త్వరలోనే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.