పూరి కొంప మళ్లీ మునిగింది!
గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ కొట్టిన ఏకైక హిట్.. ఇస్మార్ట్ శంకర్. అంతకుముందు దారుణమైన డిజాస్టర్లు ఎదురయ్యాయి పూరికి
గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ కొట్టిన ఏకైక హిట్.. ఇస్మార్ట్ శంకర్. అంతకుముందు దారుణమైన డిజాస్టర్లు ఎదురయ్యాయి పూరికి. ఇస్మార్ట్ శంకర్‌తో లైన్లో పడ్డాడులే అనుకుంటే.. తర్వాత తీసిన లైగర్‌తో కథ మొదటికి వచ్చింది. అది పూరి కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. బయ్యర్లు దారుణంగా నష్టపోవడంతో వారికి పరిహారం చెల్లించే విషయమై సుదీర్ఘ కాలం వివాదం నడిచింది. ఈ ప్రభావం పూరి కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్ మీద గట్టిగానే పడింది. ఈ సినిమాకు బిజినెస్ అయితే బాగానే జరిగింది కానీ.. లైగర్ సెటిల్మెంట్ జరిగితే తప్ప ఈ చిత్రాన్ని రిలీజ్ కానివ్వమంటూ ఎగ్జిబిటర్లు అడ్డం పడ్డ స్థితిలో రిలీజ్ తర్వాత కొంత పరిహారం చెల్లించేలా ఒప్పందం చేసుకుని ముందుకు కదిలారు. ఐతే డివైడ్ టాక్ తెచ్చుకున్న డబుల్ ఇస్మార్ట్ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయితే రాబట్టింది కానీ.. జరిగిన అమ్మకాలకు, వచ్చే వసూళ్లకు పొంతన కనిపించడం లేదు.
డబుల్ ఇస్మార్ట్‌ను అడ్వాన్స్ పద్ధతిలో రూ.54 కోట్లకు కొని రిలీజ్ చేశాడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి. కానీ అందులో నాలుగో వంతు కూడా ఇంకా వెనక్కి రాని పరిస్థితి. ఐదు రోజుల వ్యవధిలో ఈ చిత్రం రూ.11 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వీకెండ్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇక ఏం చేసినా సినిమా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయ్, కమిటీ కుర్రాళ్లు లాంటి చిన్న సినిమాలు.. డబ్బింగ్ మూవీ తంగలాన్ మాత్రమే ప్రస్తుతం బాగా ఆడుతున్నాయి. ఫుల్ రన్లో డబుల్ ఇస్మార్ట్ రూ.15 కోట్ల షేర్ మార్కును అందుకుంటే ఎక్కువ అన్నది ట్రేడ్ పండిట్ల అంచనా. డబుల్ ఇస్మార్ట్‌లో లైగర్ నష్టాలు భర్తీ చేయడం ఏమో కానీ.. ఈ సినిమా వల్ల వచ్చే కొత్త నష్టాల సంగతి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. లైగర్‌తో ఒకసారి పూరి కొంప మునిగిందనుకుంటే.. డబుల్ ఇస్మార్ట్‌తో కొంప కొల్లేరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్థితి నుంచి ఆయన పుంజుకోవడం చాలా కష్టమే.