పేరు కాదు.. కథలు మారాలి
సినిమా హీరోలు తమ ఒరిజినల్ పేర్లను పక్కన పెట్టి స్క్రీన్ నేమ్ కొత్తది పెట్టుకోవడం కొత్తేమీ కాదు.
సినిమా హీరోలు తమ ఒరిజినల్ పేర్లను పక్కన పెట్టి స్క్రీన్ నేమ్ కొత్తది పెట్టుకోవడం కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయితే.. మోహన్ బాబుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సల నాయుడు. ఇలా సినిమాల కోసం అసలు పేర్లు పక్కన పెట్టి స్క్రీన్ నేమ్ తీసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ తరం హీరోల్లో నాని, విశ్వక్సేన్ కూడా ఆ కోవకు చెందిన వాళ్లే. ఐతే తెర మీద అసలు పేర్లు అంత క్యాచీగా ఉండవని ఎంట్రీలోనే ఇలా పేర్లు మార్చుకుని తిరుగులేని ఫేమ్ సంపాదించిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. తమకు సరిగా కలిసి రావట్లేదని పేర్లు మార్చుకున్న సెలబ్రెటీలు ఉన్నారు కానీ.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆదిత్ అరుణ్ అనే యంగ్ హీరో ఇలాగే త్రిగుణ్ అని పేరు మార్చుకున్నా కెరీర్లో ఏ మార్పూ కనిపించలేదు.
అలాగే సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్.. రెండు మూడుసార్లు పేర్లు మార్చుకుని చూశాడు. కానీ అదేమంత ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు అసలు పేరుతోనే కొనసాగుతున్నాడు. సాయిధరమ్ తేజ్‌ది కూడా ఇదే వరస. తన కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు కానీ.. సాయితేజ్, సాయిదుర్గ తేజ్ అంటూ రెండుసార్లు అతను పేర్లు మార్చుకున్నాడు. కానీ అభిమానులు మాత్రం అసలు పేరుతోనే పిలుస్తున్నారు. ఈ కోవలో మరికొంత మంది ఉన్నారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన పేరును మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇంటి పేరు కాకుండా తండ్రి పేరు కలిసొచ్చేలా ‘ఆకాశ్ జగన్నాథ్’ అని పేరు మార్చుకుంటున్నాడట. ఐతే ఇలా పేరు మార్చుకోవడం కంటే కథలు మారిస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్.. ఇలా హీరోగా చేసిన సినిమాలు వేటిలోనూ కథా బలం లేదు. అంతకంతకూ క్వాలిటీ పడిపోయింది. కాబట్టి ఈసారి కథలు మారిస్తే ప్రయోజనం ఉంటుంది కానీ.. పేరు మార్చి లాభం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.