ఊపిరి వదిలే వరకూ ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే!
డ్యాషింగ్ డైరెక్టర్ మళ్లీ `పూరి మ్యూజింగ్స్ ` ని యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే.
డ్యాషింగ్ డైరెక్టర్ మళ్లీ `పూరి మ్యూజింగ్స్ ` ని యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగైదు రోజులుగా ఏదో ఒక అంశంపై స్పందిస్తూ యువతలో అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో అంశంపై తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అదేంటో ఆయన మాటల్లోనే... `శరీరానికి గాయమైతే బాడీ దాన్ని తగ్గించే పనిలో ఉంటుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి రోజులు పడుతుంది. మరికొన్నింటికి వారం పట్టొచ్చు. కానీ గాయమైతే తగ్గిపోతుంది. ఒక్కోసారి మనసుకు దెబ్బ తగులుతుంది. కన్నవాళ్లు చనిపోవచ్చు. కష్టానికి ప్రతిఫలం దక్కక్క పోవొచ్చు.
నమ్మిన వాళ్లు మోసం చేయోచ్చు. వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా..ఎంత అనర్దం జరిగినా త్వరగా మామూలు మనిషిగా మారాలి. మానసికంగా ధృఢంగా ఉండాలి. రోజుల తరబడ ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదనుకున్నప్పుడు? జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఎడవాలి? వీలైనంత త్వరగా అందులో నుంచి బయటకు రావాలి. పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ చూడకూడదు. మనల్ని ఎవరూ ఓదార్చ కూడదు. మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి.
కష్టం వచ్చినప్పుడు బాగా ఎడవండి. కానీ వెంటనే పనిలో బిజీ అవ్వండి. ప్రేమలో విఫలమైతే కొందరు మద్యానికి బానిసవుతారు. దయచేసి అలా చేయకండి. అది చాలా పిచ్చి పని. ఎంత నష్టం వచ్చినా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టమైనా ఒత్తిడిగా భావించొద్దు. అన్నం తినడం మానొద్దు. నీళ్లు తాగడం ఆపోద్దు. కావాల్సినంత నిద్ర పోవాలి. మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే మనం కోలుకుంటాం. ఏం జరిగినా తర్వాత ఏంటి? అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. నువ్వ చనిపోతున్నావని గంట ముందు తెలిసినా తర్వాత ఏం చేయాలో చేసేయ్.
ఇవన్నీ మనం బతికి ఉండటం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి వదిలే వరకూ వీటిని ఫేస్ చేయాల్సిందే. ఎవరికి వారే నచ్చజెప్పుకోవాలి. అలా చేసిన వారే అందరికంటే గొప్పవారు` అని అన్నారు. పూరి ఇచ్చిన ఈ సందేశం నేటి యువతకి ఎంతో అవసరం. ఆయన ఇందులో ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం పూరి `డబుల్ ఇస్మార్ట్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.