‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ
కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతం అవుతున్న కథానాయకుడు రాజ్ తరుణ్
‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ
నటీనటులు: రాజ్ తరుణ్-హాసిని సుధీర్-మురళీ శర్మ-ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ-ప్రవీణ్-రాజా రవీంద్ర-బ్రహ్మానందం తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: పీజీ విందా
నిర్మాతలు: రమేష్ తేజావత్-ప్రకాష్ తేజావత్
రచన-దర్శకత్వం: రామ్ భీమన
కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతం అవుతున్న కథానాయకుడు రాజ్ తరుణ్. అతను హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా రాజ్ కు ఓ మంచి విజయాన్నందించేలా ఉందా. తెలుసుకుందాం పదండి.
కథ: రామ్ (రాజ్ తరుణ్) ఒక శ్రీమంతుడు. వేల కోట్ల టర్నోవర్ కలిగిన పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అతను కాబోయే సీఈవో. తనకు బాధ్యతలు అప్పగించడానికి తండ్రి అంతా సిద్ధం చేసిన సమయంలో.. కంపెనీలో 50 శాతం షేర్లున్న రామ్ పెద్దమ్మ అడ్డు పడుతుంది. కంపెనీ సీఈవో కావాలంటే 100 రోజులు ఎవరికి కనిపించకుండా సామాన్యుడిగా బతకాలని కంపెనీ వ్యవస్థాపకుడైన పరశురామయ్య పెట్టిన షరతును ఆమె బయటికి తీస్తుంది. దానికి అంగీకరించి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు రామ్. మరి అతను ఎక్కడికి వెళ్లాడు.. ఈ వంద రోజులు ఎలా బతికాడు.. తన మిషన్ పూర్తి చేసుకుని వచ్చి కంపెనీ పగ్గాలు చేపట్టాడా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: ‘శ్రీమంతుడు’ చూసిన ఏ హీరోకైనా ఇలాంటి సినిమా మనకు పడలేదే అనిపించవచ్చు. అలాగే ‘బిచ్చగాడు’ సినిమాను.. అది సాధించిన విజయాన్ని చూసినా విజయ్ ఆంటోనీ ఎంత మంచి ఛాన్స్ కొట్టేశాడు అనిపించవచ్చు. ఐతే అలాంటి కథలు మన దగ్గరికే వచ్చి మనమే వాటిలో నటించి ఉంటే బాగుండేది అనిపించడం ఓకే. కానీ అలాంటి సినిమాలే చేద్దాం మనమూ చేద్దాం అని వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తేనే తేడా కొడుతుంది. ఐతే రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోను ‘శ్రీమంతుడు’లో ఊహించుకోవడమూ కష్టం. ‘బిచ్చగాడు’ లాంటి కథలోనూ అతను సూటవ్వడు. కానీ రామ్ భీమన అనే యంగ్ డైరెక్టర్ మాత్రం ఈ రెండు కథలనూ మిక్సీలే కొట్టి తీసి ‘పురుషోత్తముడు’ అనే మోయలేని భారాన్ని రాజ్ తరుణ్ మీద మోపేశాడు. పైన చెప్పుకున్న సినిమాల్లోని మ్యాజిక్ ను కనీస స్థాయిలోనూ రీక్రియేట్ చేయలేక.. చాలా కృతకంగా.. కృత్రిమంగా తయారైన ‘పురుషోత్తముడు’ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంది.
కొన్నిసార్లు హీరోల ఇమేజ్ అన్నది కథకు.. పాత్రకు చాలా కీలకంగా మారుతుంది. శ్రీమంతుడు లాంటి కథ స్టార్ హీరోలు చేస్తేనే బాగుంటుంది. వాళ్ల మీదే అలాంటి ఆ భారీ సెటప్ బాగా కుదురుతుంది. ఇప్పటిదాకా పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ మామూలు అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ మీద శ్రీమంతుడు తరహా కథ ఎలా నడుస్తుందని దర్శకుడు భావించాడో కానీ.. సినిమా మొదలైన కాసేపటికే ఏదో కృత్రిమత్వం వెంటాడుతున్న భావన కలుగుతుంది. వేల కోట్ల కంపెనీ సీఈవో కాబోయే అబ్బాయిగా రాజ్ మిస్ ఫిట్ అనిపిస్తాడు. అందుకు అనుగుణంగానే సినిమాలో వచ్చే సన్నివేశాలు ఏవీ పండలేదు. పైగా ఈ కథలో శ్రీమంతుడు మాత్రమే కాక మహర్షి.. బిచ్చగాడు లాంటి చాలా సినిమాల పోలికలు కనిపించడం మరింత ఇబ్బందిగా మారుతుంది. పైగా హీరో వంద రోజులు సామాన్యుడిగా బతకాలనే షరతుకు సరైన కారణం కానీ.. హీరో వెళ్లి అజ్ఞాతవాసం చేసే వ్యవహారంలో ఎలాంటి ఎమోషన్ కానీ కనిపించదు.
సిటీ నుంచి పల్లెటూరికి కథ షిఫ్ట్ అయ్యాక అక్కడ సన్నివేశాలు మరీ బోరింగ్ గా.. సాధారణంగా తయారవుతాయి. పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడే రైతులు.. వాళ్లను వేధించుకుతినే ఎమ్మెల్యే మనుషులు.. అప్పుడు హీరో వచ్చి వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారడం.. ఇదంతా కూడా చాలా మూస ధోరణిలో సాగుతుంది. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ లోనూ ఏ విశేషం లేకపోయింది. ఫైట్లు.. పాటలు సహా అన్నీ ఒక టెంప్లేట్ ప్రకారం సాగిపోతుంటాయి. ప్రథమార్ధంలో అయినా కథలో కొంచెం మలుపులు.. కదలిక కనిపిస్తాయి కానీ.. ద్వితీయార్ధం అయితే మరీ రొటీన్ గా.. బోరింగ్ గా సాగిపోతుంది. ఇక సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ప్రేక్షకులు చాలా సేపు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నిడివి రెండు గంటలే అయినా సరే.. ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా చూస్తే ఏ మాత్రం కొత్తదనం లేని.. రాజ్ తరుణ్ ఇమేజ్ కు సరిపడని కథా కథనాలు పురుషోత్తముడును బోరింగ్ సినిమాగా నిలబెట్టాయి.
నటీనటులు: రాజ్ తరుణ్ ఉన్నంతలో బాగానే చేశాడు కానీ.. ఒక స్టార్ హీరో చేయాల్సిన పాత్రకు అతను మిస్ ఫిట్ అనిపించాడు. అపర శ్రీమంతుడి పాత్రలో ఫిట్ కావడానికి బాగానే కష్టపడ్డా ఇంతకుముందు చేసిన బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రల వల్ల అతడికది సూట్ కాలేదు. వీర లెవెల్లో ఫైట్లు చేస్తే అవి కూడా తేలిపోయాయి. ఒక మామూలు కుర్రాడిగా కనిపించాల్సిన సన్నివేశాల్లో మాత్రం రాజ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హాసిని సుధీర్ యావరేజ్ అనిపిస్తుంది. తన లుక్స్.. నటన ఓ మోస్తరుగా అనిపిస్తాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించిన కాసేపు మంచి డైలాగులు, నటనతో ఆకట్టుకున్నారు. మురళీ శర్మ తన పరిధిలో బాగానే చేశారు.ప్రవీణ్ అక్కడక్కడా నవ్వించాడు. బ్రహ్మానందం పాత్ర మరీ పేలవం. ఆయన స్థాయికి తగని పాత్ర ఇచ్చారు. బ్రహ్మి లుక్స్ కూడా చాలా మారిపోవడంతో ప్రేక్షకులకు అదోలా అనిపిస్తుంది. రాజా రవీంద్ర.. కౌసల్య.. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం: ఈ మధ్య సరైన ఫాంలో లేని గోపీసుందర్.. మరోసారి నిరాశపరిచాడు. రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి కానీ.. ఓవరాల్ గా ఆల్బం అంత గొప్పగా ఏమీ లేదు. నేపథ్య సంగీతం అయితే మరీ సాధారణంగా అనిపిస్తుంది. నిజంగా గోపీనే స్కోర్ ఇచ్చాడా అనే సందేహం కలుగుతుంది. పీజీ విందా ఛాయాగ్రహణం పర్వాలేదు.ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాకెమెరా పనితనంతో కవర్ చేసే ప్రయత్నం చేశాడు విందా. నిర్మాతలు పెద్ద కాస్టింగ్ పెట్టుకుని రాజ్ తరుణ్ మీద ఎక్కువే ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది. కానీ దర్శకుడు రామ్ భీమన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. సినిమాలో ఎక్కడా కాస్తయినా కొత్తదనం కనిపించకుండా.. పరమ రొటీన్ కథాకథనాలతో బోర్ కొట్టించేశాడు. కథ అనేకాక ప్రతి సీన్లోనూ ఏదో ఒక అనుకరణే కనిపిస్తుంది తప్ప దర్శకుడి నుంచి ఏ కొత్తదనం లేకపోయింది.
చివరగా: పురుషోత్తముడు.. శ్రీమంతుడు డూప్
రేటింగ్-2/5