ఆ ఏడు నగరాల్లో పుష్ప రాజ్ మాస్ జాతర
పాట్నా, కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, మరియు హైదరాబాద్‌లో ఈ ప్రత్యేక ఈవెంట్లు జరగనున్నాయి.
ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ మాస్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 350 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో మరేసినిమా రిలీజ్ కాలేదు. దీంతో పుష్ప రాజ్ మొదటి రోజే అరుదైన రికార్డులను అందుకోబోతున్నాడు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం, ఇండియన్ సిటీలలో మాస్ ఈవెంట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లను ఇండియాలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారిక వీడియో ద్వారా ప్రకటించారు.
పాట్నా, కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, మరియు హైదరాబాద్‌లో ఈ ప్రత్యేక ఈవెంట్లు జరగనున్నాయి. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన హైప్ ఇప్పటికే అద్భుత స్థాయిలో ఉండగా, ఈవెంట్ల ద్వారా మరింతగా ఆకర్షణ పొందబోతుందని అంటున్నారు.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మిస్తున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే 250 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న, భాన్వర్ సింగ్‌గా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితర కీలక పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది.
ఈ సరికొత్త ప్రమోషన్ ప్లాన్‌తో అభిమానులు మాసివ్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్‌లో అందిస్తూ, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా రూపొందిస్తున్నాడు. ఇక దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే స్పీడ్ గా కొనసాగుతున్నాయి. మరి ఈ సినిమా విడుదల అనంతరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.